TS EAMCET 2023: ఎంసెట్‌లో శాశ్వతంగా ఇంటర్‌ వెయిటేజీ తొలగింపు!

ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలో జీవో వెలువడనుంది.

Updated : 27 Feb 2023 07:20 IST

ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులతోనే ర్యాంకులు

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలో జీవో వెలువడనుంది. ప్రస్తుతానికి ఈ ఏడాదికి ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉండదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటించినా శాశ్వతంగా తొలగిస్తూ జీవో జారీ చేయనుందని తెలిసింది. ఇప్పటివరకు ఎంసెట్‌ మార్కులకు 75 శాతం, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును నిర్ణయిస్తున్నారు. కరోనా కారణంగా 2020, 2021, 2022 ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ తొలగించారు. ఈ ఎంసెట్‌ నుంచి ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ శాశ్వతంగా ఉండదు. ప్రవేశ పరీక్షలో.. తొలుత గణితం, ఆ తర్వాత భౌతికశాస్త్రం, చివరగా రసాయన శాస్త్రంలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. కొద్ది సంవత్సరాలుగా ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నందున ఒకటికి మించి ఎక్కువ ప్రశ్నపత్రాలు ఉండడంతో మార్కులు కాకుండా పర్సంటైల్‌ను లెక్కిస్తున్నారు. పర్సంటైల్‌ కూడా ఒకటే వస్తే జన్మదినాన్ని పరిగణనలోకి తీసుకొని ఎవరు పెద్దవారైతే వారికి మెరుగైన ర్యాంకును కేటాయిస్తారు.

ఇదీ ఇప్పటివరకు ర్యాంకింగ్‌ విధానం

ఉదాహరణకు ఎంసెట్‌లో 160కి 80 మార్కులు వస్తే 75 శాతం లెక్కన 37.5 మార్కులు వచ్చినట్లుగా పరిగణిస్తారు. (80/160×75=37.5)

ఇంటర్‌లో 600 మార్కులకు 576 సాధిస్తే 25 శాతానికి కుదించినప్పుడు 24 మార్కులు వచ్చినట్లు లెక్క. (576/600×25=24)

ఎందుకు తొలగిస్తున్నారంటే....

జేఈఈ మెయిన్‌, నీట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఎప్పుడో తొలగించారు. జేఈఈ మెయిన్‌కు రాష్ట్రం నుంచి 90 వేల మంది వరకు హాజరవుతున్నారు. ఎంసెట్‌కు 1.70 లక్షల మంది వరకు ఉంటున్నారు. అంటే ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ లేకున్నా జేఈఈ మెయిన్‌కు పోటీపడుతున్నారు. బట్టీ పట్టిన వారికి ఇంటర్‌ మార్కులు అధికంగా వస్తున్నాయి. ఇంటర్‌లో 850, 900 మార్కులు దాటిన వారిలో కొందరు ఎంసెట్‌లో కనీస మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నారు. దీన్ని బట్టి సబ్జెక్టు పరిజ్ఞానం ఉండటం లేదని అధికారులు భావిస్తున్నారు. ఎంసెట్‌కు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఆర్‌జీయూకేటీ, ఓపెన్‌ స్కూల్‌ తదితర బోర్డుల విద్యార్థులు హాజరవుతారు. వాటి ఫలితాలు వెలువడకుంటే ఎంసెట్‌ ర్యాంకులను విడుదల చేయడం కుదరదు. ఈ నేపథ్యంలోనే ఎంసెట్‌ మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటించాలన్న నిర్ణయానికి వస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని