ప్రకృతి ప్రకోపం.. నష్టం అపారం

ప్రకృతి వైపరీత్యాలతో దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కరవు, కొండ చరియలు విరిగిపడటం తదితర విపత్తుల వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తోంది.

Published : 06 Mar 2023 05:18 IST

22 ఏళ్లలో కోల్పోయిన ఆస్తి రూ.12 లక్షల కోట్లు
86 వేల మంది కన్నుమూత
కరవు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఏపీ
ఆధునిక సాంకేతికత మరింత వినియోగంతోనే విపత్తుల నివారణ
పలువురు శాస్త్రవేత్తల వెల్లడి

ప్రకృతి వైపరీత్యాలతో దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కరవు, కొండ చరియలు విరిగిపడటం తదితర విపత్తుల వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తోంది. గత 22 ఏళ్లలో రూ.12 లక్షల కోట్ల ఆస్తినష్టం వాటిల్లగా.. 86 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో నగరాలను వరదలు ముంచెత్తడం సమస్యగా మారింది. వరద తీవ్రతను ముందుగానే అంచనా వేస్తూ., హెచ్చరికలు జారీ చేస్తూ, ముంపునకు గురయ్యే ప్రాంతాల నుంచి ముందుగా ప్రజలను ఖాళీ చేయిస్తూ.. వివిధ శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తున్నా ఎంతో కొంత నష్టం సంభవిస్తూనే ఉంది. దీన్ని నివారించడానికి ఆధునిక సాంకేతికతను మరింత ఎక్కువగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇటీవల హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగిన సదస్సులో వారు పలు అంశాలపై చర్చించారు. వరదల వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం ఎక్కువగా ఉంటే, దేశంలో 65 శాతం భూభాగంలో కరవు ప్రధాన సమస్యగా ఉందని, వివిధ రంగాల నిపుణులు తమ ప్రజెంటేషన్‌లో పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల ముందస్తు చర్యలు, వాటిల్లిన నష్టంపై ఇస్రో, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ, కేంద్ర జలసంఘం, జాతీయ విపత్తు నివారణ సంస్థలు చర్చించాయి. మరింత ముందుగానే తీవ్రతను గుర్తించడం, సమాచారాన్ని చేరవేయడం పైన, సమస్య తీవ్రతపైన పలువురు శాస్త్రవేత్తలు ఇచ్చిన ప్రజెంటేషన్లపై ఉన్నతస్థాయి అధికారులందరూ పాల్గొని చర్చించారు.

సాగుభూముల్లో కరవు అధికం

ప్రకృతి వైపరీత్యాలప్పుడు 12 శాతం భూభాగం వరదలకు గురైతే, తీర ప్రాంతంలో 8 శాతం తుపాన్లకు, భూకంప ప్రభావిత ప్రాంతంగా గుర్తించిన దానిలో 25 శాతం, సాగు భూమిలో 65 శాతం కరవుకు గురైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. ప్రపంచంలో వరదల బారిన పడే దేశాల్లో భారత్‌ది రెండో స్థానం. వరదల గురించి ముందస్తుగా చేస్తున్న హెచ్చరికల్లో 87 శాతం కచ్చితత్వం ఉంటోంది. కరవు ప్రభావానికి గురయ్యే రాష్ట్రాలు దేశంలో 17 ఉండగా, ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అత్యధికంగా ఒడిశాలో 98 తీవ్ర తుపాన్లు రాగా.. గత మూడేళ్లలో ఏడుసార్లు తుపాన్లు విరుచుకుపడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 79 సంభవించాయి. గత 25 ఏళ్లలో 13 సార్లు తుపాన్లు, 8 సార్లు వడగాలులు తీవ్ర స్థాయిలో వచ్చాయి. వీటి తీవ్రతను ముందుగానే మరింత కచ్చితంగా అంచనా వేయడానికి శాటిలైట్‌ బేస్‌-2, ఎక్స్‌ బాండ్‌, సి బాండ్‌ విస్తరణ, డ్యూయల్‌ పోల్‌ రాడార్‌ నెట్‌వర్క్‌, హై రిజల్యూషన్‌ టెర్రెయిన్‌ డేటాతో సహా ఏమేం చేయాలో కూడా సమావేశాల్లో చర్చించారు.


నగరాల మునకపై ప్రత్యేక చర్చ

నగరాలు నీట మునగడం సవాలుగా మారిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా చర్చించారు. గత ఒకటిన్నర దశాబ్దంలోనే చెన్నై, హైదరాబాద్‌, ముంబయి, పుణె, దిల్లీ, కోల్‌కతా తదితర నగరాలు నీటమునిగి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. పట్టణీకరణ, రోడ్లు, భవన నిర్మాణాల్లో ఆక్రమణలు, నీటి ప్రవాహ మార్గాలు లేకపోవడం, డ్రైనేజీ సౌకర్యం లేమి, మౌలిక వసతుల కరవు, దిగువ ప్రాంతాలు నీటమునగడం ఇలా అనేక కారణాలున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు, సాంకేతికత గురించి కూడా చర్చించారు.


ఈనాడు హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు