ఆ హానికారక ఇంజెక్షనేంటి?.. రక్త పరీక్షల్లోనూ రాని స్పష్టత

వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందడానికి కారణమైన హానికారక ఇంజెక్షన్‌ ఏంటనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Updated : 06 Mar 2023 09:50 IST

ప్రీతి మృతికి కారణాలు ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదికలోనైనా తేలేనా!

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందడానికి కారణమైన హానికారక ఇంజెక్షన్‌ ఏంటనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆమె మరణించి వారం రోజులు గడిచినా ఈ విషయంపై స్పష్టత రాలేదు. హైదరాబాద్‌ నిమ్స్‌ వైద్యుల తాజా నివేదికల్లో సైతం దీనికి సంబంధించి స్పష్టత కొరవడింది. వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాలలో అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి గత నెల 22న బలవన్మరణానికి యత్నించిన సంగతి తెలిసిందే. సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ వేధింపులు భరించలేక ఆమె హానికారక ఇంజెక్షన్‌ తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. తొలుత వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స చేసిన వైద్యులు.. మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు.

తొలుత వెంటిలేటర్‌పై.. తర్వాత ఎక్మో యంత్రంపై వైద్యం అందించినా ఫలితం లేకపోవడంతో గత నెల 26న ప్రీతి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఆమెది హత్యేనంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రీతి శరీరం నుంచి రక్త నమూనాలను సేకరించిన నిమ్స్‌ వైద్యులు వాటిల్లో విషపు ఆనవాళ్లున్నాయా అనేది తేల్చేందుకు చికిత్స సమయంలోనే పది రకాల పరీక్షలు నిర్వహించారు. అయితే ఏ హానికారక ఇంజెక్షన్‌ తీసుకోవడం వల్ల ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడిందనేది తాజాగా బహిర్గతమైన నివేదికల్లోనూ తేలలేదు. కొన్ని సందర్భాల్లో హానికారక ఇంజెక్షన్‌ తీసుకున్నప్పుడు సాధారణ రక్త పరీక్షల్లో గుర్తించడం కష్టమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కొన్ని హానికారక ఇంజెక్షన్ల గురించి ఎఫ్‌ఎస్‌ఎల్‌ పరీక్షల్లోనూ తేలే అవకాశాలు తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు