Governor Tamilisai: మహిళపై రాళ్లేసిన వ్యక్తులకు సన్మానాలా?

‘‘రాష్ట్రంలో అత్యున్నత హోదాలో ఉన్న మహిళ పట్ల కూడా అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. వివక్ష చూపిస్తున్నారు.

Updated : 07 Mar 2023 09:11 IST

తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశం పంపాలనుకుంటున్నారు?
గవర్నర్‌ తమిళిసై
పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతిని రక్షించుకోలేకపోయామని ఆవేదన

ఈనాడు, హైదరాబాద్‌ -  సోమాజిగూడ, న్యూస్‌టుడే: ‘‘రాష్ట్రంలో అత్యున్నత హోదాలో ఉన్న మహిళ పట్ల కూడా అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. వివక్ష చూపిస్తున్నారు. చాలా హాస్యాస్పదంగా వ్యవహరిస్తున్నారు. మహిళపై రాళ్లు విసిరిన వ్యక్తులకే పూలదండలు వేస్తూ.. అలాంటి వారిని సన్మానిస్తూ తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు? ఇది చాలా దురదృష్టకర పరిణామం’’ అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. ఇది తనకు మాత్రమే జరిగిన అవమానం కాదని.. మొత్తం మహిళలకు జరిగిన అవమానమని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ ప్రసంగించారు. ‘‘సంస్కృతీ సంప్రదాయాలున్న రాష్ట్రం తెలంగాణ. నా పట్లే కాదు.. ఏ మహిళ పట్ల అవమానకరంగా మాట్లాడినా సహించేది లేదు. నా విజ్ఞప్తి ఒక్కటే.. మహిళలను గౌరవించండి. సామాజిక మాధ్యమాల్లో హుందాగా వ్యవహరించండి. మహిళలను అదే పనిగా తూలనాడొద్దు’’ అని హితవుపలికారు. తెలంగాణలో ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయని.. ప్రతిభావంతురాలైన పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతిని రక్షించుకోలేకపోవడం బాధగా ఉందని ఆవేదన వెలిబుచ్చారు. రుద్రమదేవి పుట్టిన నేల ఇదని.. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ‘ఒక మహిళకు అన్యాయం జరిగితే.. నేను వెంట నడుస్తాను. నాకు జరిగితే మీరంతా వెంట ఉంటారని బలంగా విశ్వసిస్తున్నా. మరింత దృఢంగా మారతాను’ అని పేర్కొన్నారు.

సిద్ధాంతాలు వేరుగా ఉండొచ్చు.. సందర్భాన్ని బట్టి కలిసిపోవాలి

‘‘గుర్తింపునకు నోచుకోని ప్రతిభావంతులను గుర్తించడమే రాజ్‌భవన్‌ ప్రధాన విధి. అత్యున్నత స్థానాల్లో ఉన్న అధికారిణులు, మహిళా మంత్రులందరికీ ఆహ్వాన పత్రాలు పంపించాను. వీరిలో అత్యధికులు రాలేదు. రాజకీయంగా సిద్ధాంతాలు, ఆలోచనలు వేరుగా ఉండొచ్చు. కానీ, సందర్భం వచ్చినప్పుడు కలిసి పోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు అలాంటి సంస్కృతీసంప్రదాయాలు పక్కనబెడుతున్నారు. ఒక చోటు నుంచి ఆహ్వానం వెళితే.. దాన్ని మరోలా చూస్తున్నారు. అందరూ సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటున్నా. మహిళాభివృద్ధికి, వారిలో నూతనోత్సాహాన్ని నింపేందుకు రాజ్‌భవన్‌ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నేను గిరిజన ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించాను. వారి కోసం పౌష్టికాహార లడ్డూలను అందించాం. ప్రత్యేకంగా టూ వీలర్‌ అంబులెన్సులను తయారు చేయించి కొన్ని గిరిజన ప్రాంతాలకు అందుబాటులోకి తేగలిగాం. ఈ రకంగా కొన్ని రూపాల్లో తెలంగాణ ప్రజలకు సేవలందిస్తున్నా. నాకంటూ వ్యక్తిగత లక్ష్యాలు లేవు. ఏం చేసినా తెలంగాణ ప్రజల కోసమే. మహిళల కోసం పనిచేస్తున్నా.. చేస్తూనే ఉంటా’’ అని గవర్నర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.రాధారాణి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ, ఐఏఎస్‌ అధికారిణి శైలజా రామయ్యర్‌, టీఎస్‌పీఎస్సీ సభ్యులు సుమిత్ర ఆనంద్‌, అరుణకుమారి, కర్నల్‌ నికత్‌ జహాన్‌, లెఫ్టినెంట్‌ కమాండర్‌ అఖిల సోమరాజు, కెప్టెన్‌ లలిత, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అధికారిణి మంజుశర్మ, సినీ నటి పూనమ్‌ కౌర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని