Foxconn: కొంగర కలాన్‌లో ఫాక్స్‌కాన్‌.. ధ్రువీకరించిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం

ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్‌ హాయ్‌ టెక్నాలజీ’ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్‌’ సంస్థ.. రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగర కలాన్‌లో భారీ పెట్టుబడులతో తమ ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పనుంది.

Updated : 07 Mar 2023 09:14 IST

సీఎం కేసీఆర్‌ దార్శనికతను స్ఫూర్తిగా పేర్కొంటూ ఛైర్మన్‌ యంగ్‌ లియూ లేఖ
తైవాన్‌కు రావాలని ఆహ్వానం
ఈనాడు - హైదరాబాద్‌

ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్‌ హాయ్‌ టెక్నాలజీ’ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్‌’ సంస్థ.. రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొంగర కలాన్‌లో భారీ పెట్టుబడులతో తమ ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఈ అంశాన్ని ధ్రువీకరిస్తూ సంస్థ ఛైర్మన్‌ యంగ్‌ లియూ సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇటీవల రాష్ట్రంలో టీ-వర్క్స్‌ ప్రారంభానికి విచ్చేసిన ‘ఫాక్స్‌కాన్‌’ ఛైర్మన్‌ యంగ్‌ లియూ.. సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్‌ కంపెనీకి.. రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. తద్వారా ఫాక్స్‌కాన్‌ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. లక్ష ఉద్యోగాల కల్పనకు బాటలు వేసింది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు,  ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ మరుసటిరోజే బెంగళూరులో ఫాక్స్‌కాన్‌ సంస్థ పెట్టుబడులు పెట్టనున్నట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టడంలేదనే వదంతులు వెలువడ్డాయి. అయితే తాజాగా సంస్థ ఛైర్మన్‌ యంగ్‌ లియూ తెలంగాణలో ఫాక్స్‌కాన్‌ స్థాపనపై స్పష్టతనిస్తూ లేఖ రాయడంతో వదంతులకు తెరపడినట్లయింది.

ఈ లేఖతో తెలంగాణలో వారి సంస్థ పెట్టుబడుల విషయంలో స్పష్టత వచ్చింది. వీలైనంత త్వరలో కొంగర కలాన్‌లో తమ సంస్థ ఉత్పత్తిని ప్రారంభిస్తామన్న యంగ్‌ లియూ.. లేఖలో సీఎం కేసీఆర్‌ మద్దతు కోరారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పలు అంశాలను యంగ్‌ లియూ ప్రస్తావించారు. ‘‘హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా నాకు, నా బృందానికి మీరిచ్చిన ఆతిథ్యానికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. హైదరాబాద్‌లో మేము అద్భుతమైన సమయాన్ని గడిపాం. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ.. మీరు స్వదస్తూరితో రాసి గ్రీటింగ్‌ కార్డు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వ్యక్తిగతంగా అది నాకు అమితానందాన్ని కలిగించింది. తెలంగాణ పరిణామం, అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషి, మీ దార్శనికత నాలో స్ఫూర్తిని నింపింది. భారత్‌లో నాకో కొత్త మిత్రుడు లభించారు. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. మార్చి 2న మీతో సమావేశం సందర్భంగా చర్చించిన మేరకు త్వరలోనే కొంగర కలాన్‌లో సంస్థను ప్రారంభించడానికి ఫాక్స్‌కాన్‌ కట్టుబడి ఉంది. ఈ దిశగా మేము చేపట్టబోయే కార్యాచరణలో మీరు సంపూర్ణ మద్దతునివ్వాలని కోరుతున్నాను. మీరు నా అతిథిగా తైవాన్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. త్వరలోనే మీతో మరోసారి సమావేశానికి ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు