High-speed rail: తెలుగు రాష్ట్రాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్!
తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తూ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పట్టాలు ఎక్కే అవకాశాలున్నాయి. ఈ మేరకు ప్రాథమిక కసరత్తును రైల్వే శాఖ ప్రారంభించింది.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు
శంషాబాద్‌లో ప్రారంభం... వయా విజయవాడ
ఒకట్రెండు నెలల్లో ప్రాథమిక అధ్యయనం
కార్యరూపం దాలిస్తే హైదరాబాద్- విశాఖ నాలుగు గంటల్లోనే
ఈనాడు, హైదరాబాద్: తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తూ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పట్టాలు ఎక్కే అవకాశాలున్నాయి. ఈ మేరకు ప్రాథమిక కసరత్తును రైల్వే శాఖ ప్రారంభించింది. ఈ ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్‌లో రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు. రెండోది ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నుంచి విజయవాడ వరకు. ఈ కారిడార్లలో గరిష్ఠంగా 220 కిలోమీటర్ల వేగంతో రైలును పరుగులెత్తించాలని రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక ఇంజినీరింగ్, ట్రాఫిక్ స్డడీ (పెట్) సర్వే ఒకట్రెండు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
6 నెలల్లో నివేదిక...
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం వెళ్లేందుకు వరంగల్, ఖమ్మం మీదుగా ఒకటి... నల్గొండ, గుంటూరు మీదుగా మరోమార్గం ఉన్నాయి. ఈ రెండూ రద్దీ మార్గాలే. వరంగల్ మార్గం గరిష్ఠ సామర్థ్యం 150 కిమీ. ప్రతిపాదిత హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం, కర్నూలు-విజయవాడ హైస్పీడ్ కారిడార్లలో గంటకు గరిష్ఠంగా 220 కిమీ వేగంతో వెళ్లేలా నూతన లైన్లను నిర్మించాలన్నది రైల్వేశాఖ ప్రతిపాదన. దీనికి సంబంధించిన ఇంజినీరింగ్, ట్రాఫిక్ అధ్యయనం కోసం రైల్వేశాఖ ఇటీవలే టెండర్లు పిలిచింది. త్వరలోనే అధ్యయనం చేసే సంస్థను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. హైస్పీడ్ రైలు ఏ మార్గంలో ఉండాలన్న అంశంపై సదరు సంస్థ రైల్వేశాఖకు ఆరు నెలల్లో నివేదిక ఇస్తుంది. దీని ఆధారంగా ప్రాజెక్టు ప్రాథమిక అంచనా వ్యయం తెలుస్తుంది. ఆ తర్వాత సమ్రగ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందిస్తారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుతో అనుసంధానం...
ప్రాథమిక అంచనాల ప్రకారం హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం మార్గం శంషాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి నేరుగా, వేగంగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు ఈ మార్గం ఉపయుక్తంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడకు కొత్త హైస్పీడ్ మార్గాన్ని ప్రతిపాదిస్తారా?... నల్గొండ, గుంటూరు మీదుగానా?... లేదంటే హైదరాబాద్-విజయవాడ వయా సూర్యాపేట 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా ఉంటుందా? అన్నది కీలకం కానుంది. పెట్ సర్వేలో ఏ రూట్ ఎంపిక అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
రాయలసీమకూ... హైస్పీడ్ కారిడార్
ఏపీలోని రాయలసీమ ప్రాంతాల నుంచి విజయవాడకు రైల్లో రావడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి కర్నూలు వరకు మరో హైస్పీడ్ కారిడార్ కోసం రైల్వే శాఖ కసరత్తు చేస్తుంది. ఇది కార్యరూపం దాలిస్తే కర్నూలు నుంచి విజయవాడకు ఆపైన విశాఖపట్నం వరకు హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తుంది. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.
నాలుగు గంటల్లో విశాఖపట్నానికి...
హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం అత్యంత రద్దీ మార్గం. ఇప్పటికే ట్రాక్ సామర్థ్యానికి మించి రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రైళ్లలో- సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం చేరేందుకు సగటున 12 గంటల సమయం పడుతోంది. దురంతో ఎక్స్‌ప్రెస్ 10.30 గంటలు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 8.30 గంటల సమయంలో గమ్యం చేరుతున్నాయి. హైస్పీడ్ కారిడార్ ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే సుమారు నాలుగు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకునే అవకాశం ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్