SC railway: పూరీ... కాశీ... అయోధ్య... రైల్వేశాఖ ఆధ్యాత్మిక పర్యాటకం

దక్షిణ మధ్య రైల్వే నుంచి తొలి భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలు ఈనెల 18న పట్టాలు ఎక్కనుంది. దీనికి రైల్వేశాఖ ‘పుణ్యక్షేత్ర యాత్ర’గా నామకరణం చేసింది.

Updated : 16 Mar 2023 07:07 IST

18న పట్టాలు ఎక్కనున్న భారత్‌ గౌరవ్‌ రైలు

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే నుంచి తొలి భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలు ఈనెల 18న పట్టాలు ఎక్కనుంది. దీనికి రైల్వేశాఖ ‘పుణ్యక్షేత్ర యాత్ర’గా నామకరణం చేసింది. టూర్‌ ప్యాకేజీ వివరాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌ బుధవారం రైల్‌ నిలయంలో వెల్లడించారు. పూరీ, కాశీ, అయోధ్య క్షేత్రాల్ని సందర్శించుకునేలా యాత్ర ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రెండో ట్రిప్‌ ఏప్రిల్‌ 18న మొదలవుతుందని, ప్రతి నెలా ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. 8 రాత్రులు, 9 రోజులపాటు ఈ యాత్ర సాగుతుంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో 18న ప్రారంభమయ్యే భారత్‌ గౌరవ్‌ రైలు..పూరీ, కోణార్క్‌, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై 26 ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. పూరీలో జగన్నాథ ఆలయం, కోణార్క్‌లో సూర్య దేవాలయం, గయలో విష్ణుపాద ఆలయం, వారణాసిలో విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయాలు, గంగాహారతి, అయోధ్యలో రామజన్మభూమి, హనుమాన్‌ గఢీ, ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం, హనుమాన్‌ మందిర్‌ తదితర చోట్లకు తీసుకెళతారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ రైలు సికింద్రాబాద్‌, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో ఆగుతుంది.

ఛార్జీలు ఎంతంటే...

భారత్‌ గౌరవ్‌ రైల్లో మొత్తం 700 సీట్లున్నాయి. ఇందులో స్లీపర్‌-460. థర్డ్‌ ఏసీ-192, సెంకడ్‌ ఏసీ-48 ఉన్నాయి. ప్యాకేజీలో ప్రయాణ ఛార్జీలు, స్థానిక రవాణా, భోజనం, వసతి ఖర్చులు కలిపి ఉంటాయని ద.మ.రైల్వే తెలిపింది.

స్లీపర్‌లో:  సింగిల్‌ షేరింగ్‌ రూ.15,300, గదిని ఇద్దరు, ముగ్గురు షేర్‌ చేసుకుంటే రూ.13,955 ; 5-11 ఏళ్ల పిల్లలకు రూ.13,060.

థర్డ్‌ ఏసీలో: సింగిల్‌ షేరింగ్‌ రూ.24,085, గదిని ఇద్దరు లేదా ముగ్గురు షేర్‌ చేసుకుంటే రూ.22,510; 5-11 ఏళ్ల పిల్లలకు రూ.21,460.

సెకండ్‌ ఏసీలో: సింగిల్‌ షేరింగ్‌ రూ.31,510, గదిని ఇద్దరు లేదా ముగ్గురు షేర్‌ చేసుకుంటే రూ.29,615; 5-11 ఏళ్ల పిల్లలకు రూ.28,360.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని