సంక్షిప్త వార్తలు (13)
‘కంటి వెలుగు’ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 80,67,243 మందికి నేత్రపరీక్షలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కంటివెలుగు కార్యక్రమంలో 80 లక్షల మందికి పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: ‘కంటి వెలుగు’ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 80,67,243 మందికి నేత్రపరీక్షలు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 13,70296 మందికి ఉచితంగా కళ్లద్దాలు, మందులు అందజేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. అందులో పేర్కొన్న ప్రకారం 40 ఏళ్ల లోపు వారిలో దగ్గరిచూపు సరిగాలేక ఇబ్బందిపడే వారు అధికంగా ఉన్నారు. ఇలాంటి వారికి తక్షణమే కళ్లద్దాలు అందజేస్తున్నారు.ఇతర కంటి సమస్యలతో వస్తున్న చాలా మందికి చుక్కల మందులతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువమంది క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో అవసరమైన వారికి శస్త్రచికిత్సలకు తేదీలు చెప్తున్నారు.
గతంతో పోల్చితే పెరిగిన రవాణా ఆదాయం: మంత్రి పువ్వాడ
ఈనాడు, హైదరాబాద్: రవాణాశాఖ ఆదాయం గతేడాది కంటే ఈసారి బాగా పెరగడంపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సంతృప్తి వ్యక్తం చేశారు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాసరాజు, కమిషనర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, సంయుక్త కమిషనర్లు సి.రమేశ్, మమతాప్రసాద్‌లతో శనివారమిక్కడ ఆయన సమావేశమయ్యారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 వరకు రూ.6,055 కోట్ల ఆదాయం వచ్చిందని, గత సంవత్సర ఆదాయంతో పోలిస్తే ఈసారి అదనంగా రూ.2,309 కోట్లు (58.14శాతం) వచ్చాయని అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.53 కోట్ల వాహనాలు ఉండగా త్రైమాసిక పన్ను కట్టకుండా తిరుగుతున్న 21,347 వాహనాల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ తనిఖీ ద్వారా గుర్తించి జరిమానా సహా రూ.63.58 కోట్లు వసూలు చేశామన్నారు. దీంతో అధికారుల పనితీరును మంత్రి ప్రశంసించినట్లు రవాణాశాఖ వర్గాలు తెలిపాయి.
ఎంపీ పాటిల్ అభ్యర్థనకు హైకోర్టు తిరస్కరణ
ఈనాడు, హైదరాబాద్: తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. తన ఎన్నికపై మదన్‌మోహన్‌రావు వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ పాటిల్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. పాటిల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఝార్ఖండ్‌లో నమోదైన క్రిమినల్ కేసును వెల్లడించలేదన్న కారణం పిటిషన్‌లో పేర్కొన్నారన్నారు. అయితే ఈ కేసు వేతనాల వ్యవహారంలో కంపెనీకి సంబంధించిందన్నారు. దీని వల్ల ఎన్నికపై ఎలాంటి ప్రభావం లేనందున ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి ఎన్నికల పిటిషన్‌పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తేలుస్తామన్నారు. పాటిల్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని కొట్టివేస్తూ ప్రధాన పిటిషన్‌పై విచారణను జులై 1కి వాయిదా వేశారు.
గ్రామాల్లో పారదర్శక సేవలు అందిస్తున్నాం
బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి
కాజీపేట, న్యూస్‌టుడే: గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్న బాలవికాస సంస్థపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, గత 45 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్థ సేవలందిస్తున్నామని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి తెలిపారు. బాలవికాస సంస్థలపై ఐటీ దాడుల నేపథ్యంలో శనివారం ఆయన వరంగల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇప్పటి వరకు సంస్థ ద్వారా 8 వేల గ్రామాల్లో అనేక సేవాకార్యక్రమాలను పారదర్శకంగా నిర్వహించామని పేర్కొన్నారు. సంస్థ రూ.400 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. పారదర్శకంగా ఉంటున్నందునే ఇతర దేశాల సంస్థలు బాలవికాసకు నిధులు అందిస్తున్నాయని వివరించారు. వాటిని ఇతర కార్యకలాపాలకు మళ్లించలేదన్నారు.
24 నుంచి అందుబాటులో ఎస్సెస్సీ హాల్‌టికెట్లు
ఈనాడు, హైదరాబాద్: వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఈ నెల 24న హాల్‌టికెట్లను వెబ్‌సైట్లో ఉంచడంతో పాటు ఆయా పాఠశాలలకు పంపుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణపై శనివారం అధికారులతో మంత్రి సమీక్షించారు. మొత్తం 4.94 లక్షల మంది హాజరవుతారని, 2,652 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు పాల్గొన్నారు.
30,395 మంది విద్యార్థులకు రవాణా ఛార్జీలు
ఈనాడు, హైదరాబాద్: విద్యార్థులు నివాసముండే ఆవాసాలకు తగిన దూరంలో పాఠశాలలు లేని 30,395 మందికి కొత్త విద్యా సంవత్సరం(2023-24)లో రవాణా ఛార్జీలు అందజేయాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం జీవో జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బడులు లేని ఆవాసాలు 3,688 ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 2,032 మందికి, అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 145 మంది విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఇందుకోసం రూ.18.23 కోట్లు అవసరమని అంచనా వేశారు.
ఇంటర్ ఆంగ్లం-2 ప్రశ్నపత్రంలో తప్పు
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆంగ్ల ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్నకు సంబంధించి తప్పుగా ముద్రితం కావడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. దీన్ని ఇంటర్‌బోర్డు అధికారులు గుర్తించి అన్ని కళాశాలలకు సమాచారం ఇచ్చి వివరించడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. సెక్షన్-సిలో ఇచ్చిన పదో ప్రశ్నలో.. అవసరమైనచోట ఎనిమిది విరామ చిహ్నాలు(ఫంక్చువేషన్స్) వినియోగించి వాక్యం రాయాలని, ఒక్కో దానికి అర మార్కు అని ముద్రించారు. వాస్తవానికి అక్కడ నాలుగు విరామ చిహ్నాలు, ఒక్కోదానికి ఒక మార్కు అని ఉండాలి.
బ్యాంక్ లోక్ అదాలత్‌లో 1,756 కేసుల పరిష్కారం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన బ్యాంక్ లోక్ అదాలత్ కార్యక్రమంలో 1,756 కేసులు పరిష్కారమైనట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎస్.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మొత్తం రూ.10.26 కోట్ల విలువైన వివాదాలు పరిష్కారమయ్యాయన్నారు.
వేతన సవరణ వెంటనే చేపట్టాలి: ఐకాస
ఈనాడు, హైదరాబాద్: పెండింగులో ఉన్న విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను పూర్తి చేసి వెంటనే వేతనాలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (ఐకాస) ప్రభుత్వాన్ని కోరింది. అలాగే, 1999-2004 మధ్యకాలంలో విద్యుత్ శాఖ ఉద్యోగాల్లో చేరిన వారితోపాటు ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణమండపంలో ఉద్యోగులతో ఐకాస సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఐకాస ఛైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్‌రావు, కో-ఛైర్మన్ శ్రీధర్, కో కన్వీనర్ బీసీరెడ్డిలు మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు ఉద్యోగులు పెద్దసంఖ్యలో హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ నెల 20న వరంగల్‌లో, 21న పాల్వంచలో నిర్వహించనున్న సన్నాహక సమావేశాలు, 24న చేపట్టిన విద్యుత్ సౌధ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
ఆస్ట్రేలియాలో సిరిసిల్ల చీర ప్రదర్శన
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: సిరిసిల్ల మరమగ్గంపై ఇక్కత్ పట్టుతో నేసిన, అగ్గిపెట్టెలో పట్టే చీరను ఆస్ట్రేలియాలో శుక్రవారం ప్రదర్శించారు. అంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన రాధిక ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా చీరల ఉత్పత్తులకు ఉన్న ప్రత్యేకతపై అక్కడ సెమినార్ జరిగింది. అందులో భాగంగా సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్‌తో నెలరోజుల క్రితం ప్రత్యేకంగా చీరను తయారు చేయించి తీసుకెళ్లారు. ఈ చీర ప్రత్యేకతను అక్కడి వారికి వివరించారు. గతంలో పాలిస్టర్ నూలుతో అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన విజయ్.. ఈసారి ఇక్కత్ పట్టుతో మరమగ్గంపై తయారు చేయడం ప్రత్యేకత.
ఓటీటీకి సెన్సార్ తప్పనిసరి చేయాలి: విజయశాంతి
ఇంటర్నెట్ డెస్క్: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమయ్యే చిత్రాలు, సిరీస్‌లకు సెన్సార్ తప్పనిసరి చేయాలని ప్రముఖ నటి, భాజపా నేత విజయశాంతి అన్నారు. ఆ అంశాన్ని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళలు సంబంధిత బోర్డు ముందుకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ‘‘ఈ మధ్యనే విడుదలైన ఓ తెలుగు(బహుభాషా) ఓటీటీ సిరీస్‌పై..’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు. ఓటీటీలో ప్రసారమయ్యే అసభ్యకరమైన దృశ్యాలను తొలగించి, ప్రజావ్యతిరేకతకు గురికాకుండా చూసుకోవాలని సంబంధిత నటులు, నిర్మాతలకు విజయశాంతి సూచించారు.
గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహనలో గిన్నిస్ రికార్డు
సదస్సుకు 3,465 మంది మహిళల హాజరు
పొన్నూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, సీపీవోఐ సంయుక్త ఆధ్వర్యంలో గర్భాశయ క్యాన్సర్‌పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3,465 మంది మహిళలు పాల్గొని రికార్డు నెలకొల్పారు. ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ జడ్జిగా పాల్గొన్న స్వప్నిల్ డంగారికర్ మాట్లాడుతూ... గతంలో 1,919 మంది మహిళలకు అవగాహన కల్పించిన రికార్డును విజ్ఞాన్‌లో సదస్సుతో అధిగమించినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య, హైదరాబాద్ యశోద వైద్యశాల రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్టు సుంకవల్లి చినబాబు, అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన సీపీవోఐ వ్యవస్థాపకురాలు, సీఈవో సత్య ఎస్.కలంగిలకు అందించారు. ఈ సందర్భంగా లావు రత్తయ్య, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ... వర్సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో మహిళలంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో అవగాహన సదస్సును నిర్వహించినట్లు చెప్పారు.
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ ఇవ్వాలి
బోర్డు మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వృద్ధులకు ఛార్జీలో 50 శాతం రాయితీ ఇవ్వాలని ఆ సంస్థ బోర్డు మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో కోరారు. తద్వారా సర్కారుకు మంచి పేరుతో పాటు 50 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో వృద్ధులకు ఈ రాయితీ సౌకర్యం ఉందని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
YSRCP: ఆ అత్యాశే కొంప ముంచిందా?
-
General News
NTPC: ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి ప్రారంభం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Sajjala: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలూ ఎవరో గుర్తించాం : సజ్జల
-
Ap-top-news News
Rains: వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
-
Politics News
Andhra News: మండలిలో మారనున్న బలాబలాలు