నష్టాల్లో విద్యుత్‌ పంపిణీ సంస్థలు

దేశవ్యాప్తంగా విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల నష్టాలు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి 117 డిస్కంలు ఉండగా వీటికి 2020-21లో రూ.54,057 కోట్ల నష్టాలు వచ్చినట్లు జాతీయ విద్యుత్‌ ఆర్థిక సంస్థ(పీఎఫ్‌సీ) అధ్యయనంలో వెల్లడైంది.

Updated : 19 Mar 2023 05:02 IST

2020-21లో 117 డిస్కంల నష్టాలు రూ.54,057 కోట్లు
జాతీయ విద్యుత్‌ ఆర్థిక సంస్థ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల నష్టాలు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కలిపి 117 డిస్కంలు ఉండగా వీటికి 2020-21లో రూ.54,057 కోట్ల నష్టాలు వచ్చినట్లు జాతీయ విద్యుత్‌ ఆర్థిక సంస్థ(పీఎఫ్‌సీ) అధ్యయనంలో వెల్లడైంది. డిస్కంల పనితీరు, ఆర్థిక పరిస్థితులపై ఈ సంస్థ అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ డిస్కంలు విద్యుత్‌ను కొనుగోలు చేసి, వినియోగదారులకు సరఫరా, పంపిణీ(టీడీ) చేసేలోగా 27.25% నష్టపోతుంటే, తెలంగాణలో 13.33% ఉన్నట్లు తేలింది. జాతీయ స్థాయిలో ఇది 22.32%. తెలంగాణలో అంతకుముందు ఏడాది(2019-20)తో పోలిస్తే టీడీ వాణిజ్య నష్టాలు 2020-21లో 21.92 నుంచి 13.33 శాతానికి తగ్గగా ఏపీలో 10.77 నుంచి 27.25 శాతానికి పెరిగాయి. నివేదికలోని ముఖ్యాంశాలు...

* మొత్తం 117 డిస్కంల అప్పులు 2021 మార్చి 31 నాటికి రూ.5.86లక్షల కోట్లకు మించిపోయాయి. ఇందులో తమిళనాడు డిస్కంలు రూ.1.45 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఏపీ రూ.34,288 కోట్లతో ఆరు, తెలంగాణ రూ.31,032 కోట్లతో ఏడు స్థానాల్లో ఉన్నాయి.

* వివిధ వర్గాలకు ఉచితంగా, తక్కువ ఛార్జీలకు కరెంటు సరఫరా చేసినందుకు 2020-21లో రూ.1,32,416 కోట్లను రాయితీ పద్దు కింద డిస్కంలకు రాష్ట్రాలు చెల్లించాలి. కానీ రూ.1,11,949 కోట్లను మాత్రమే విడుదల చేశాయి.

* ఒక యూనిట్‌ కరెంటు సరఫరాకు సగటు వ్యయం జాతీయ స్థాయిలో రూ.6.19 ఉంది. యూనిట్‌కు వచ్చిన ఆదాయం సగటున రూ.5.78 మాత్రమే. అంటే ప్రతి యూనిట్‌పై సగటున 41 పైసల చొప్పున డిస్కంలు నష్టపోయాయి. తెలంగాణలో యూనిట్‌కు సగటున 106 పైసలు, ఏపీలో 94 పైసల నష్టం వస్తోంది.

* 2020-21లో ఏపీ డిస్కంలకు రూ.7,350 కోట్లు, తెలంగాణలో రూ.6,686కోట్ల నష్టాలు వచ్చాయి.

* 2020-21లో తలసరి విద్యుత్‌ వినియోగం జాతీయ సగటు 1,255 యూనిట్లకు చేరింది. తెలంగాణలో 2126, ఏపీలో 1373 యూనిట్లుగా నమోదైంది.

* 2020-21లో తెలంగాణలో 59,450 మి.యూ.ల కరెంటును వినియోగించగా ఇందులో ఇళ్లకు 21.33%, వ్యవసాయానికి 33.05%, పరిశ్రమలకు 20.97% వాడారు.

* తెలంగాణలో ఒక యూనిట్‌పై సగటున రూ.4.34 ఆదాయం వచ్చింది. ఇందులో ఇళ్ల నుంచి రూ.4.36, వాణిజ్య సంస్థల నుంచి రూ.10.41, పరిశ్రమల నుంచి 8.15 చొప్పున ఆదాయం వచ్చింది.

* విక్రయించిన కరెంటుకు పూర్తిస్థాయిలో బిల్లులు రాక డిస్కంలు నష్టాల్లో మునుగుతుంటే.... వీటికి కరెంటును అమ్ముతున్న విద్యుదుత్పత్తి కేంద్రాలు(జెన్‌కో)లు రూ.2700 కోట్ల లాభాలను ఆర్జించాయి. భారీ టవర్ల ద్వారా కరెంటును డిస్కంలకు సరఫరా చేసే ట్రాన్స్‌కోలు సైతం రూ.955 కోట్ల లాభాలను పొందాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని