చైల్డ్‌ పోర్నోగ్రఫీ నిందితులపై సస్పెక్ట్‌ షీట్లు

‘చైల్డ్‌ పోర్నోగ్రఫీ’ని అరికట్టడంపై తెలంగాణ సీఐడీ దృష్టి సారించింది. నిందితులపై సస్పెక్ట్‌ షీట్లు తెరవడంతో పాటు రిపీటెడ్‌ అఫెండర్లపై పీడీ చట్టం ప్రయోగిస్తామని సీఐడీ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ స్పష్టం చేశారు.

Updated : 19 Mar 2023 05:21 IST

కేసుల దర్యాప్తు పురోగతి సమీక్షలో మహేశ్‌ భగవత్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘చైల్డ్‌ పోర్నోగ్రఫీ’ని అరికట్టడంపై తెలంగాణ సీఐడీ దృష్టి సారించింది. నిందితులపై సస్పెక్ట్‌ షీట్లు తెరవడంతో పాటు రిపీటెడ్‌ అఫెండర్లపై పీడీ చట్టం ప్రయోగిస్తామని సీఐడీ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ స్పష్టం చేశారు. చైల్డ్‌ పోర్నోగ్రఫీకి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో.. ‘బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన అంశాల (చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్‌ మెటీరియల్‌ - సీశామ్‌)’ను సర్క్యులేట్‌ చేసేవారిపై నిఘా ఉంచేందుకు జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) రూపొందించిన టిప్‌లైన్స్‌ సమాచారాన్ని విశ్లేషించే పనిలో సీఐడీ నిమగ్నమైంది. టిప్‌లైన్స్‌ అందించే సమాచారం ఆధారంగా ఇంతవరకు 31 కేసుల్ని ఆయా పోలీస్‌స్టేషన్లలో నమోదు చేయించింది. ఈ కేసుల్లో 43 మందిని అరెస్ట్‌ చేయించగలిగింది. ఆయా కేసుల దర్యాప్తు పురోగతిపై మహేశ్‌ భగవత్‌ ఇటీవల సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ముందు 16 కేసుల్లో 22 మందిని అరెస్ట్‌ చేయగా.. సమీక్ష తర్వాత 15 కేసుల్లో 21 మందిని అరెస్ట్‌ చేశారు. కొత్తగా మరో 13 కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం 34 కేసులు దర్యాప్తులో ఉండగా.. 8 కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి. కాగా కేసుల దర్యాప్తును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సమీక్ష సందర్భంగా మహేశ్‌ భగవత్‌ సూచించారు. దర్యాప్తు త్వరితగతిన పూర్తిచేసి అభియోగపత్రాలు నమోదు చేసిన అధికారుల్ని ఆయన అభినందించారు. సమీక్షలో హైదరాబాద్‌ సీసీపీఎస్‌ డీసీపీ స్నేహామెహ్రా, సీఐడీ సైబర్‌క్రైమ్స్‌ అదనపు ఎస్పీ టి.వి.హనుమంతరావు, డీఎస్పీ గుణశేఖర్‌, ఇన్‌స్పెక్టర్లు ప్రసాద్‌, రామకృష్ణారెడ్డితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయా కేసుల దర్యాప్తు అధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని