రైలులో మంగళసూత్రం చోరీ.. బాధితురాలికి రూ.లక్ష చెల్లించండి

రైల్వే కంపార్ట్‌మెంటులో పోలీసులను నియమించకపోవడంతోపాటు చోరీ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పరిహారంగా బాధితురాలికి రూ.లక్ష చెల్లించాలని దక్షిణ మధ్య (ద.మ.) రైల్వే, గుంటూరు రైల్వే పోలీసులను హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-1 ఆదేశించింది.

Updated : 19 Mar 2023 05:23 IST

ద.మ.రైల్వే, రైల్వే పోలీసులకు వినియోగదారుల కమిషన్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రైల్వే కంపార్ట్‌మెంటులో పోలీసులను నియమించకపోవడంతోపాటు చోరీ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పరిహారంగా బాధితురాలికి రూ.లక్ష చెల్లించాలని దక్షిణ మధ్య (ద.మ.) రైల్వే, గుంటూరు రైల్వే పోలీసులను హైదరాబాద్‌ వినియోగదారుల కమిషన్‌-1 ఆదేశించింది. హైదరాబాద్‌లోని బాగ్‌అంబర్‌పేట్‌కు చెందిన ఎం.జి.మాధవి 2019, జులై 27న స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సికింద్రాబాద్‌ నుంచి నెల్లూరుకు ప్రయాణించారు. ఆ రోజు అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని మంగళసూత్రం, నల్లపూసల తాడు (80గ్రాములు) లాక్కొని పారిపోయారు. తేరుకున్న మాధవి తోటి ప్రయాణికులను అప్రమత్తం చేసినా ఫలితం లేకపోయింది. తర్వాత టీటీఈ, పోలీసుల సూచన మేరకు బాధితురాలు గుంటూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో పురోగతి కనిపించకపోవడంతో ఆమె కమిషన్‌ను ఆశ్రయించారు. స్పందించిన ప్రతివాదులు ఈ కేసు కమిషన్‌ పరిధిలోకి రాదని, రైల్వే క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌కు వస్తుందని వివరణ ఇచ్చారు. కేసు విచారణలో క్లూ దొరకలేదని రైల్వే పోలీసులు వివరించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన కమిషన్‌.. రిజర్వేషన్‌ స్లీపర్‌ కంపార్ట్‌మెంట్‌లోకి అజ్ఞాతవ్యక్తులు సులువుగా ఎలా వస్తారని ప్రశ్నించింది. ఇది ముమ్మాటికీ సేవాలోపమే అని, టీటీఈ నిర్లక్ష్యంతోనూ ఆగంతుకులు బోగిల్లోకి ప్రవేశించారని పేర్కొంది. ఇందుకుగాను ద.మ. రైల్వే, గుంటూరు రైల్వే పోలీసులు సంయుక్తంగా బాధితురాలికి రూ. లక్ష నష్టపరిహారం, కేసు ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని ఆదేశిస్తూ కమిషన్‌ తాజాగా తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని