టీఎస్‌పీఎస్సీ పరీక్షల రీషెడ్యూలు

ప్రశ్నపత్రాల లీకేజీతో పలు పరీక్షలను రీషెడ్యూలు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. వేటిని రీషెడ్యూలు చేసే అవకాశముంది? వేటిని యథాతథంగా కొనసాగించవచ్చన్న విషయమై కసరత్తు చేస్తోంది.

Updated : 19 Mar 2023 06:42 IST

కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు యథాతథం
మిగతా వాటి తేదీల్లో మార్పులకు అవకాశం
సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న కమిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీతో పలు పరీక్షలను రీషెడ్యూలు చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. వేటిని రీషెడ్యూలు చేసే అవకాశముంది? వేటిని యథాతథంగా కొనసాగించవచ్చన్న విషయమై కసరత్తు చేస్తోంది. తక్కువ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే పరీక్షల్ని వీలైనంత త్వరగా ముగించేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షల్ని టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఈనెలలో జరగాల్సిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల పరీక్షలను వాయిదా వేసింది. ఏప్రిల్‌, మేలో జరగాల్సిన పరీక్షల తేదీలూ రీషెడ్యూలయ్యే అవకాశముంది. రద్దుచేసిన, వాయిదా వేసిన పరీక్షలకు నెలాఖరులోగా తేదీలను ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసింది.

వేగంగా కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు

సాధారణంగా ఏదైనా పోటీ పరీక్షకు రెండు నెలల ముందుగా ప్రశ్నపత్రాలు సిద్ధమవుతాయి. రానున్న రెండు నెలల్లో జరగాల్సిన పరీక్షలకు ప్రశ్నపత్రాలను సిద్ధం చేయడానికి కొంత సమయం పట్టనుంది. నలభై వేల మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యే పోటీ పరీక్షలను కమిషన్‌ ఓఎంఆర్‌పద్ధతిలో నిర్వహిస్తోంది. అంతకు తక్కువగా ఉంటే కంప్యూటర్‌ ఆధారితంగా పరీక్షలు పెడుతోంది. ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించడానికి కనీసం మూడు నెలల సమయం అవసరం. ప్రశ్నపత్రం సిద్ధం చేసి, ముద్రించి, పరీక్ష కేంద్రాల వరకు సరఫరా చేయడానికి సమయం పడుతుంది. కొన్ని పోటీ పరీక్షలకు ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో తక్కువ సంఖ్యలో అభ్యర్థులున్న వాటికి కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. వాటిని వేగంగా నిర్వహించడంతోపాటు ఫలితాలనూ వెంటనే ఇచ్చేందుకు అవకాశముందని కమిషన్‌ వర్గాలు భావిస్తున్నాయి.

గ్రూప్‌-4, 2 పరీక్ష తేదీలపై సందిగ్ధం

గత షెడ్యూలు ప్రకారం జూన్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరగాల్సిఉంది. అదేనెలలో యూపీఎస్‌సీ, జేఈఈ పరీక్షలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్‌ 11న నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. ఇప్పటికే గ్రూప్‌-4, 2 పరీక్షల తేదీలను ప్రకటించింది. వీటిని అనుకున్న సమయానికే నిర్వహించాలా? అనే విషయమై ఆలోచిస్తోంది. తొలుత గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష జరగనుంది. జులై 1న గ్రూప్‌-4, ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ మూడింటినీ వరుసగా నిర్వహిస్తే అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తుతాయా? సిద్ధమయ్యేందుకు సమయం సరిపోతుందా? అనే విషయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు