ఎన్‌ఎండీసీ సీఎండీగా శ్రీధర్‌ నడిమట్ల!

ప్రస్తుతం సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌ సీఎండీగా ఉన్న శ్రీధర్‌ నడిమట్ల జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ) ఛైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులు కానున్నారు.

Published : 19 Mar 2023 03:05 IST

సిఫార్సు చేసిన పీఈఎస్‌బీ

ఈనాడు, దిల్లీ: ప్రస్తుతం సింగరేణి కాలరీస్‌ లిమిటెడ్‌ సీఎండీగా ఉన్న శ్రీధర్‌ నడిమట్ల జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ) ఛైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులు కానున్నారు. ఆ పోస్టుకు ఆయన పేరును సిఫార్సు చేయాలని శనివారం జరిగిన సమావేశంలో పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సెలెక్షన్‌ బోర్డు (పీఈఎస్‌బీ) నిర్ణయించింది. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న.. దేశంలోనే అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తి సంస్థకు నేతృత్వం వహించే పోస్టుకు మొత్తం ఏడు దరఖాస్తులు రాగా వాటిలో నుంచి శ్రీధర్‌ పేరును ఎంపిక చేసి కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖకు సిఫార్సు చేసింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న సుమిత్‌ దేబ్‌ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయడంతో తాత్కాలికంగా ఆ బాధ్యతలను అదే సంస్థలో డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా పనిచేస్తున్న అమితవ ముఖర్జీకి అప్పగించారు. తర్వాత పూర్తిస్థాయి సీఎండీ కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. అమితవ ముఖర్జీతోపాటు ఎంఓఐఎల్‌ మానవ వనరుల విభాగం డైరెక్టర్‌ ఉషాసింగ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ రాకేష్‌ తుమానె, బీఎస్‌ఎన్‌ఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ రాజీవ్‌ సోని, ఆర్‌వీఎన్‌ఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సరోజ్‌ కాంత పాత్ర, ఇండియన్‌ రైల్వేస్‌ స్టోర్స్‌ సర్వీస్‌ హయ్యర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ అధికారి అశోక్‌కుమార్‌ వర్మ, సింగరేణి సీఎండీ శ్రీధర్‌ నడిమట్ల దరఖాస్తు చేసుకున్నారు. అందరి పేర్లను పరిశీలించిన అనంతరం ఎంపిక బోర్డు శ్రీధర్‌ పేరును సిఫార్సు చేసింది. 1997 బ్యాచ్‌ తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శ్రీధర్‌ 2015 జనవరిలో సింగరేణి సీఎండీగా నియమితులై ఇప్పటివరకు అదే పదవిలో కొనసాగుతున్నారు. సింగరేణిలో చేరకముందు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు అనంతపురం, కృష్ణా, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్‌గా, రాజమండ్రి సబ్‌కలెక్టర్‌గా, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ పీవోగా, కాకినాడ పోర్ట్స్‌ డైరెక్టర్‌గా సేవలందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు