కుమారస్వామిరెడ్డి జీవితం అందరికీ ఆదర్శం

విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కుమారస్వామిరెడ్డి జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ డాక్టర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు.

Published : 19 Mar 2023 03:05 IST

‘ఎ లైఫ్‌ ఇన్‌ సివిల్‌ సర్వీస్‌’ పుస్తక ఆవిష్కరణలో దువ్వూరి సుబ్బారావు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కుమారస్వామిరెడ్డి జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ డాక్టర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. కుమారస్వామిరెడ్డి తన స్వీయ అనుభవాలను వివరిస్తూ రాసిన ‘ఎ లైఫ్‌ ఇన్‌ సివిల్‌ సర్వీస్‌’ పుస్తకాన్ని శనివారం రాత్రి బేగంపేట ఐఏఎస్‌ అధికారుల సంఘం కార్యాలయంలో సుబ్బారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రచయిత తనకు 50 ఏళ్లుగా తెలుసని, ఆయన ఎన్నడూ ధర్మాన్ని వీడలేదన్నారు. ఆదాయ పన్ను శాఖ మాజీ చీఫ్‌ కమిషనర్‌ నర్సింహప్ప మాట్లాడుతూ... పదవీ విరమణ తర్వాత కుమారస్వామిరెడ్డి ప్రారంభించిన సేవా కార్యక్రమాలను 89 ఏళ్ల వయసులో ఇప్పటికీ కొనసాగిస్తుండటం అభినందనీయమన్నారు. కుమారస్వామిరెడ్డి మాట్లాడుతూ... తన పుస్తకాన్ని గొప్ప వ్యక్తితో ఆవిష్కరించుకోవాలనే కల నెరవేరిందన్నారు. తాను విధుల నిర్వహణలో ధర్మబద్ధంగా వ్యవహరించినందునే తితిదే ఈఓగా పనిచేసే అవకాశం దక్కిందన్నారు. 1982కు ముందున్న విలువలు ఇప్పుడు లేవన్నారు. కార్యక్రమంలో కుమారస్వామిరెడ్డి కుటుంబ సభ్యులు, పలువురు విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

రూపాయి విలువపై ఆందోళన అవసరం లేదు

రూపాయి విలువ 2013లో మాదిరిగా తగ్గిపోయే పరిస్థితులు ఇప్పుడు లేవనీ, దానిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు స్పష్టంచేశారు. పుస్తకావిష్కరణ అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘మనదేశంలో ద్రవ్యలోటు అధికంగా ఉండటంతో 2013లో రూపాయి విలువ తగ్గింది. ఇప్పుడు ద్రవ్యలోటు నియంత్రణలోనే ఉంది. మన దగ్గర విదేశీ మారకద్రవ్య నిల్వలు అధికంగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రూపాయి విలువపై ఆందోళన అవసరం లేదు. మనదేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సురక్షితంగానే ఉన్నారు. అమెరికాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంకు ఘటన నేపథ్యంలో మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే... సిలికాన్‌ వ్యాలీ బ్యాంకు డిపాజిట్లన్నీ దీర్ఘకాలంపాటు కొన్ని బ్యాంకుల్లోనే ఉన్నారు. మన బ్యాంకుల డిపాజిట్లు వివిధ చోట్ల ఉన్నాయి’ అని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు