స్తంభించిన సమాచార కమిషన్‌!

రాష్ట్రంలో సమాచార హక్కు (సహ) చట్టం అమలుతీరును పర్యవేక్షించాల్సిన రాష్ట్ర సమాచార కమిషన్‌ స్తంభించింది. అయిదుగురు రాష్ట్ర సమాచార కమిషనర్ల పదవీకాలం పూర్తవడంతో కమిషన్‌ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.

Updated : 19 Mar 2023 04:34 IST

కమిషనర్ల పదవీ విరమణతో పేరుకుపోయిన 7900 అప్పీళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సమాచార హక్కు (సహ) చట్టం అమలుతీరును పర్యవేక్షించాల్సిన రాష్ట్ర సమాచార కమిషన్‌ స్తంభించింది. అయిదుగురు రాష్ట్ర సమాచార కమిషనర్ల పదవీకాలం పూర్తవడంతో కమిషన్‌ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.  విచారణల్లేక 65 మంది ఉద్యోగులు ఖాళీగా ఉంటున్నారు. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ) పోస్టు ఏడాది నుంచే ఖాళీగా ఉంది. సీఐసీగా పనిచేసిన రాజా సదారాం పదవీ విరమణ తరువాత ప్రభుత్వం మరెవరినీ నియమించకుండా అప్పటి కమిషనర్‌ బుద్దా మురళికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయన పదవీకాలం కూడా గత సెప్టెంబరు ఆఖరులోనే పూర్తయింది. ఆ తరువాతా మరెవరినీ నియమించలేదు. సహ చట్టం నిబంధనల ప్రకారం 9 మందిని సమాచార కమిషనర్లుగా ప్రభుత్వం నియమించవచ్చు. కానీ మూడేళ్ల క్రితం అయిదుగురినే నియమించగా వారి పదవీకాలం గత నెల 23తో పూర్తయింది. చట్ట ప్రకారం కమిషనర్ల పదవీకాలం పూర్తికావడానికి ముందే కొత్తవారి నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేతతో కూడిన కమిటీ కమిషనర్లను ఎంపిక చేయాలి. కానీ ఇంతవరకూ కొత్తవారి నియామకానికి ఎలాంటి చర్యలను ప్రభుత్వం చేపట్టలేదు.

నెలకు 5-6 వందల అప్పీళ్లు

సహ చట్టం కింద సమాచారం కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా అక్కడున్న ‘ప్రజా అధికారి’ (పీఐఓ) 30 రోజుల్లోగా సమాచారం ఇచ్చి తీరాలి.  గడువులోగా ఇవ్వకపోతే సమాచారం ఇప్పించమని అదే కార్యాలయ అధిపతిగా ఉన్న ఉన్నతాధికారికి మొదటి అప్పీలును బాధితులివ్వాలి. అక్కడా స్పందన లేకపోతే పీఐఓ నిర్లక్ష్యాన్ని వివరిస్తూ సమాచారాన్ని ఇప్పించాలని కోరుతూ సమాచార కమిషన్‌కు బాధితులు తుది అప్పీలు చేస్తారు. ఇలా వచ్చి.. సమాచార కమిషన్‌లో పేరుకుపోయిన అప్పీళ్లు 7900 దాకా ఉన్నట్లు అక్కడి ఉద్యోగులు తెలిపారు. ఇంకా నెలకు అయిదారు వందల అప్పీళ్లు వస్తున్నాయి. కమిషనర్లుంటే వాటిపై రోజూ విచారణ జరిపి చర్యలు తీసుకునేవారు. అసలు కమిషనర్లే లేనందున పీఐఓలు  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమాచారం ఇవ్వడం లేదని  బాధితులు వాపోతున్నారు.

ఏమీ కాదనే ధీమా?

ప్రజలకు సమాచారం ఇవ్వకపోయినా, కమిషన్‌లో విచారణకు వెళ్లినా ఏం కాదనే ధీమా పీఐఓల్లో నాటుకుపోయిందని ఓ సీనియర్‌ అధికారి వివరించారు. నిజాయతీపరులను కమిషనర్లుగా నియమించి.. సమాచారం ఇవ్వని పీఐఓలపై జరిమానాలు విధిస్తే తప్ప చట్టం పక్కాగా అమలుకాదని పేర్కొన్నారు. సమాచార కమిషనర్లను నియమించాలని సుపరిపాలనావేదిక సైతం ఇటీవల విన్నవించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు