టీఎస్‌పీఎస్సీ పారదర్శకతపై సీఎం దృష్టి

తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు అంశాలపై అధికారులు, మంత్రులతో చర్చించినట్లు తెలిసింది.

Published : 19 Mar 2023 03:05 IST

సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చ

తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు అంశాలపై అధికారులు, మంత్రులతో చర్చించినట్లు తెలిసింది. సంస్థ కార్యకలాపాల్లో మరింత భద్రత, నిఘా, పోస్టుల భర్తీ, వనరుల కల్పన, పారదర్శకత తదితర అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన చర్యలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఎస్‌పీఎస్సీపై  శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, సీఎస్‌ శాంతికుమారి, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, మాజీ ఛైర్మన్‌ చక్రపాణిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, అనంతర పరిణామాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రధానంగా ప్రశ్నపత్రాల భద్రత, నిల్వపై ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం సరికాదని పేర్కొన్నట్లు సమాచారం. ఇకపై పొరపాట్లకు తావులేకుండా కమిషన్‌ కార్యకలాపాలు సాగించాలన్నారు. లీకేజీకి సంబంధించి శుక్రవారం సీఎంకు టీఎస్‌పీఎస్సీ నివేదిక సమర్పించగా.. దానిలోని అంశాలపైనా సమావేశంలో ప్రస్తావించారు. లీకేజీ వ్యవహారంపై సిట్‌ విచారణ నివేదిక అందిన వెంటనే దానికి అనుగుణంగా దోషులపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల్లో సంపూర్ణ భరోసా కల్పించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రద్దుచేసిన పరీక్షలను సత్వరమే పకడ్బందీ ప్రణాళికతో నిర్వహించాలని సూచించారు. ప్రశ్నపత్రాలు, మూల్యాంకనం, పరీక్ష ఫలితాలు, ఎంపికతో కూడిన పరీక్షల రహస్య సమాచారం (సీక్రెసీ ఆఫ్‌ ఎగ్జామ్స్‌) పర్యవేక్షణ అంశం పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ కార్యదర్శి పర్యవేక్షణలో లేని విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఐఏఎస్‌ అధికారి కార్యదర్శిగా ఉన్నందున పూర్తిస్థాయి రహస్య విభాగాల పర్యవేక్షణ బాధ్యతలు కార్యదర్శికే ఇవ్వాలనే విషయమై చర్చించినట్లు సమాచారం. టీఎస్‌పీఎస్సీ ప్రధాన కార్యాలయం తరలింపుపైనా చర్చ జరిగినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని