ప్చ్.. మళ్లీనా...!
టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీతో గ్రూప్-1తోపాటు మొత్తం నాలుగు ఉద్యోగ పరీక్షలు రద్దవడంతో ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
గ్రూప్-1 మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల్లో కలవరం
తుది పరీక్ష తర్వాత తాత్కాలిక కొలువుల్లో చేరాలనే ప్రణాళిక
ప్రిలిమ్స్ రద్దుతో అంతా తారుమారు
ఆర్థిక భారంపై తీవ్ర ఆందోళన
ఈనాడు, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీతో గ్రూప్-1తోపాటు మొత్తం నాలుగు ఉద్యోగ పరీక్షలు రద్దవడంతో ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ సాధించిన వారు ఆర్థిక భారాన్ని తలచుకుని కలవరం చెందుతున్నారు. మానసికంగానూ ఇబ్బంది పడుతున్నారు. మరో మూడు నెలల్లో మెయిన్స్ పూర్తవుతుంది. కచ్చితంగా కొలువు సాధిస్తామన్న విశ్వాసంతో చదువుతున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. ‘మళ్లీ ప్రిలిమ్స్ రాయాలా? ఒకవేళ పొరపాటున గట్టెక్కలేకుంటే ఎలా? ఈ మధ్యలో ఇంకెన్ని పరిణామాలు సంభవిస్తాయో?’ అనే ప్రశ్నలు వారిని వెంటాడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో ఉంటూ సన్నద్ధం కావాలంటే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు.
హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉండి సిద్ధమవ్వాలంటే నెలకు అన్నీ కలిపి రూ.10 వేల ఖర్చు తప్పదని చెబుతున్నారు. నలుగురు కలిసి గది అద్దెకు తీసుకుంటే కొంత తగ్గుతుంది. వారిప్పుడు కనీసం మరో ఆరు నెలలు అదనంగా ఉండక తప్పదు. ఇక ప్రిలిమ్స్ నెగ్గలేదని వెనక్కి వెళ్లిన వారు మళ్లీ సిద్ధమవుతారు. ఇలాంటి వారు చాలామంది హైదరాబాద్‌కు చేరుకుంటారు. అంటే వారంతా మళ్లీ ఖర్చు పెట్టాల్సిందే. ‘పరీక్షల రద్దుతో శిక్షణ సంస్థలు, హాస్టళ్లు, పుస్తకాల రచయితలు, వాటి పబ్లిషర్లు, వాటిని విక్రయించే వారికి మాత్రం లాభమే’ అని గాంధీనగర్‌లో ఉంటున్న పలువురు నిరుద్యోగులు వ్యాఖ్యానించారు.
జిల్లాలకు వెళ్లే ఆలోచనలో...
4 పరీక్షలు రద్దవడంతో అనేక మంది సొంత జిల్లాలకువెళ్లే ప్రయత్నాల్లోఉన్నారు. కొందరు ఇప్పటికే వెళ్లిపోయారు. గ్రూప్-1, 2లను సాధించాలన్న లక్ష్యంతో సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు(46)గా పనిచేస్తున్న ఒకరు ఉద్యోగానికి సెలవు పెట్టి కుటుంబంతోసహా హైదరాబాద్ వచ్చారు. తాజా పరిణామంతో ఆయన ఉద్యోగంలో చేరేందుకు వెళ్లిపోయారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి 20 మంది ఉండే హాస్టల్‌లో ఏడాది కాలంగా ఉంటున్నారు. అక్కడ ఒక్కటే టాయిలెట్ ఉండేది. అపరిశుభ్రంగా ఉన్నా లక్ష్యం కోసం భరించారు. ఇప్పుడు ఆయన వెనక్కి వెళ్లిపోయారు. ‘కొందరు గృహిణులు పిల్లల్ని, భర్తను వదిలి గ్రూప్స్ లక్ష్యంతో హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు భర్త అర్థం చేసుకున్నా అత్తామామలు అర్థం చేసుకోకుంటేనే పరీక్షలపై సరిగ్గా దృష్టి సారించగలరు’ అని శిక్షణ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలోని గ్రంథాలయాల్లోనూ రెండు రోజులుగా నిరుద్యోగ అభ్యర్థుల హాజరు శాతం తగ్గింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో నిరాశకు గురికాకుండా మరింత పట్టుదలతో చదవాలని అభ్యర్థులకు శిక్షణ నిపుణుడు కృష్ణ ప్రదీప్ సూచించారు.
రెండేళ్లుగా అప్పులతో గడుపుతున్నాం
- రమేష్‌రెడ్డి, గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థి
మాది సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం. జూనియర్, డిగ్రీ అధ్యాపక ఉద్యోగాలను దక్కించుకోవాలన్న లక్ష్యంతో 2013లోనే స్లెట్, నెట్ అర్హత సాధించా. 2012 తర్వాత ఒక్క నోటిఫికేషన్ రాలేదు. ఇంటర్ విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ వస్తున్నా. గ్రూప్ పరీక్షలపై ఆసక్తి ఉండటంతో 2020 చివరి నుంచి సన్నద్ధమవుతున్నా. నా భార్యతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటున్నా. ఈ రెండేళ్లగా ఉద్యోగం చేయకపోవడంతో అప్పులు తెచ్చి గడుపుతున్నాం. జూన్‌లో మెయిన్స్ పూర్తయితే ఫలితాలు వచ్చే వరకు జూనియర్ లెక్చరర్‌గా చేరదామనుకున్నా. ఇప్పుడు మళ్లీ చదవాలి.
నిద్ర పట్టడం లేదు
- అమిత, నారాయణపేట జిల్లా
నేను జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నా. గ్రూప్-1 లక్ష్యంగా ఉద్యోగానికి సెలవు పెట్టి, ఏడాది నుంచి హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్నా. ప్రిలిమ్స్‌లో నెగ్గా. మెయిన్స్‌లోనూ ర్యాంకు సాధించి ఎంపికవుతానన్న నమ్మకముంది. లీకేజీ కారణంగా నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు సెలవు రద్దు చేసుకుని, జిల్లాకు వెళ్లిపోవాలా? ఇక్కడే ఉండాలా? అనేది తేల్చుకోలేకపోతున్నా.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
KTR: తెలంగాణకు ఏమీ ఇవ్వని మోదీ మనకెందుకు: మంత్రి కేటీఆర్
-
India News
Immunity boosting: మళ్లీ కరోనా కలకలం.. ఈ ఫుడ్‌తో మీ ఇమ్యూనిటీకి భలే బూస్ట్!
-
Movies News
Anushka Sharma: పన్ను వివాదంలో లభించని ఊరట.. అనుష్క శర్మ పిటిషన్ కొట్టివేత
-
Sports News
Cricket: అత్యంత చెత్త బంతికి వికెట్.. క్రికెట్ చరిత్రలో తొలిసారేమో!
-
General News
Telangana News: రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు