ఊబకాయులూ తస్మాత్‌ జాగ్రత్త!

సాధారణంగానే ఊబకాయుల్లో క్యాన్సర్‌ ముప్పు అధికం. దీనికితోడు నియంత్రణలో లేని అధిక రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండడం, నడుము చుట్టుకొలతలు తగ్గకపోవడం... వంటి జీవక్రియ రుగ్మతలు (మెటబాలిక్‌ సిండ్రోమ్‌) కూడా జతకూడితే... మహమ్మారి వచ్చే ముప్పు రెట్టింపు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated : 19 Mar 2023 08:40 IST

జీవక్రియ రుగ్మతలు తోడైతే క్యాన్సర్‌ ముప్పు రెట్టింపు
విజరల్‌ కొవ్వు కణజాలం మహమ్మారి వృద్ధికి కారణమవుతోంది
స్వీడన్‌ తాజా పరిశోధనలో వెల్లడి
ఆరోగ్య స్పృహ, పోషకాహారం, అప్రమత్తతలే శ్రీరామరక్ష  
డాక్టర్‌ రాకేశ్‌ కలపాల సూచనలు
ఈనాడు - హైదరాబాద్‌

సాధారణంగానే ఊబకాయుల్లో క్యాన్సర్‌ ముప్పు అధికం. దీనికితోడు నియంత్రణలో లేని అధిక రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండడం, నడుము చుట్టుకొలతలు తగ్గకపోవడం... వంటి జీవక్రియ రుగ్మతలు (మెటబాలిక్‌ సిండ్రోమ్‌) కూడా జతకూడితే... మహమ్మారి వచ్చే ముప్పు రెట్టింపు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, జీవక్రియ రుగ్మతలు రెండూ ఉన్న వారిలో ‘విజరల్‌ కొవ్వు కణజాలం (విజరల్‌ ఎడిపోస్‌ టిష్యూ) అధికంగా ఉంటుందనీ, ఇది క్యాన్సర్‌ కణాల వృద్ధికి కారణం అవుతుందని చెబుతున్నారు. ఈ అంశాన్ని స్వీడన్‌లో నిర్వహించిన పరిశోధన వెల్లడించింది. ఆ దేశంలోని లుండ్‌ యూనివర్సిటీ పరిశోధకులు దాదాపు 40 ఏళ్లపాటు స్వీడన్‌, నార్వే, ఆస్ట్రియా దేశాలకు చెందిన సుమారు 8లక్షల మందితో ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రధానంగా శరీరం ఎత్తుకు తగిన బరువు(బాడీ మాస్‌ ఇండెక్స్‌), జీవక్రియ రుగ్మతల కోణంలోనే అధ్యయనం కొనసాగింది. వీరి పరిశీలనలో ఊబకాయంతోపాటు జీవక్రియ రుగ్మతలతో బాధపడుతున్న వారిలో 23,630 మంది క్యాన్సర్‌ బారిన పడినట్లుగా గుర్తించారు. ఈ పరిశోధక పత్రం ఇటీవలే ‘జర్నల్‌ ఆఫ్‌ ది నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఊబకాయం, జీవక్రియ రుగ్మతలు బాధితులు మహమ్మారి కోరల్లో చిక్కుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీనియర్‌ కన్సల్టెంట్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌, సెంటర్‌ ఫర్‌ ఒబెసిటీ అండ్‌ మెటబాలిక్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌(ఏఐజీ హాస్పిటల్స్‌) డాక్టర్‌ రాకేశ్‌ కలపాల ‘ఈనాడు’కు వివరించారు.

రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న కేసులు

తెలంగాణలో ఏటేటా క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నట్లు ఐసీఎంఆర్‌ ఇటీవల విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. 2020 సంవత్సరంలో 47,620 కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదవగా.. 26,038 మంది చనిపోయారు. 2021లో 48,775 మంది కొత్తగా మహమ్మారి బారినపడగా.. 26,681 మంది బలయ్యారు. 2022లో 49,983 మంది క్యాన్సర్‌ కోరల్లో కొత్తగా చిక్కుకోగా.. 27,339 మంది కన్నుమూశారు. ప్రతి 9మంది భారతీయుల్లో ఒకరు తన 74 ఏళ్ల వయసుకొచ్చేసరికి ఏదో ఒక క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లు ఐసీఎంఆర్‌ నివేదిక స్పష్టంచేసింది. ఇదే సమయంలో రాష్ట్రంలో జీవక్రియ రుగ్మతల బాధితులూ పెరుగుతున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర పౌష్టిక ముఖచిత్రం’లో గత ఐదేళ్ల కాలంలో మహిళలు, పురుషుల్లో 8% చొప్పున అధిక రక్తపోటుతో బాధపడే వారు పెరిగారు. 2019-20 గణాంకాల ప్రకారం... 15-49 ఏళ్ల మధ్యవయస్కులైన మహిళల్లో 20% మంది, పురుషుల్లో 27% మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇదే వయస్కుల్లో మహిళల్లో 6%, పురుషుల్లో 7% చొప్పున షుగర్‌ వ్యాధిగ్రస్తులున్నట్లు నమోదైంది. ఇదేకాలంలో మహిళలు 30%, పురుషులు 32% మంది ఊబకాయం బారినపడినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రమాదకరంగా విజరల్‌ కొవ్వు కణజాలం

అవయవాల మధ్య ఉండే కొవ్వు పదార్థాన్ని విజరల్‌ కొవ్వు కణజాలం అంటారు. ఇది మనిషి శరీరంలోని అనేక సాధారణ, రోగ ప్రక్రియలను ప్రభావితం చేసే ప్రత్యేకమైన జీవ రసాయన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా ఉన్న వారిలో జీవక్రియ రుగ్మతలు కూడా తోడైతే... క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే.. వీరిలో ‘ప్రో ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్లు’ అధికంగా ఉత్పత్తి అవుతాయి. వీటివల్ల దీర్ఘకాలంగా నిశ్శబ్దంగా ఇన్‌ఫ్లమేషన్‌ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ కొవ్వు కణజాలం ఎక్కువగా ఉన్న వారిలో తల నుంచి పాదం వరకు ఏ అవయవంలోనైనా క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందే ప్రమాదం పెరుగుతుంది. మరో ముఖ్యవిషయం... సన్నగా ఉన్నా మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉన్న వారిలో క్యాన్సర్‌ ముప్పు ఎక్కువ. ఉదాహరణకు కొందరు సన్నగా ఉన్నా కూడా వీరిలో కాలేయంపై కొవ్వు(ఫ్యాటీ లివర్‌) పేరుకుపోతుంది. ఫ్యాటీ లివర్‌ దీర్ఘకాలంగా ఉన్న వారికి కాలేయ క్యాన్సర్‌ రావడాన్ని నిపుణులు గుర్తించారు.

పోషకాహారమే పరమౌషధం

జీవక్రియ రుగ్మతలున్న వారు ఎట్టిపరిస్థితుల్లోనూ రక్తపోటును, మధుమేహాన్ని, కొలెస్ట్రాల్‌ను అదుపులో పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఎప్పటికప్పుడు సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ‘హోమియోస్టాసిస్‌ మోడల్‌ అసెస్‌మెంట్‌-ఎస్టిమేటెడ్‌ ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌(హోమా ఐఆర్‌)’ అనేది ముఖ్యమైన పరీక్ష. దీని ద్వారా ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఎంతుందనేది తెలుస్తుంది. అప్పుడు సమస్యను అంచనా వేయొచ్చు. అత్యంత ముఖ్యంగా ఊబకాయులు బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కంటి నిండా నిద్రపోవాలి. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అలవర్చుకోవాలి. ప్రధానంగా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తదితర ఆహారాలను తీసుకోవాలి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో మైక్రోన్యూట్రియెంట్లు, పీచు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే విటమిన్‌ ఎ, సి, ఈ, ఫోలిక్‌యాసిడ్‌, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం వంటివి అధికంగా ఉంటాయి. చేపలు, సముద్ర ఆహారం ద్వారా విటమిన్‌ డి లభ్యమవుతుంది. ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు కూడా వీటిలో ఎక్కువ. ఈ ఆహారం యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. విటమిన్‌ ఎ, సి, ఈ, డిలు శ్వాస కోశ ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు