సాగర్‌ స్పిల్‌వే మరమ్మతులు ప్రారంభం

నాగార్జునసాగర్‌ డ్యాం స్పిల్‌వేకు 12 ఏళ్ల తర్వాత మరమ్మతులు ప్రారంభమయ్యాయి. సాగర్‌ డ్యాం స్పిల్‌వే బకెట్‌ పోర్షన్‌ మరమ్మతులతో పాటు అప్రోచ్‌ రోడ్డుకు ప్రభుత్వం రూ.19.99 కోట్లు మంజూరు చేసింది.

Published : 19 Mar 2023 04:13 IST

విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ డ్యాం స్పిల్‌వేకు 12 ఏళ్ల తర్వాత మరమ్మతులు ప్రారంభమయ్యాయి. సాగర్‌ డ్యాం స్పిల్‌వే బకెట్‌ పోర్షన్‌ మరమ్మతులతో పాటు అప్రోచ్‌ రోడ్డుకు ప్రభుత్వం రూ.19.99 కోట్లు మంజూరు చేసింది. పనులు చేపట్టేందుకు గతేడాది మేలో మూడుసార్లు టెండర్లు పిలవగా ఒక్క టెండరే వచ్చింది. అయినా ఆ కంపెనీకే అధికారులు పనులు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం స్పిల్‌వే దిగువన ఉన్న బకెట్‌ పోర్షన్‌లో నీటిని మోటార్లతో తోడి అక్కడ ఏర్పడిన గుంతల కొలతలు తీసుకుంటున్నారు. స్పిల్‌వే దగ్గరకు వెళ్లే రహదారి నీటమునగడంతో అధికారులు, సిబ్బంది పుట్టీల్లో వెళ్తున్నారు. 2011లో వరదలకు స్పిల్‌వే దెబ్బతిన్నప్పుడు రీఇన్‌ఫోర్స్‌డ్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ను దెబ్బతిన్న చోట రంధ్రాల్లోకి పంపారు. జాతీయ నిర్మాణ (ఎన్‌ఏసీ) సంస్థ సూచించిన కాంక్రీట్‌ మిక్స్‌డ్‌ డిజైన్‌ ప్రకారం మెటీరియల్‌ వాడారు. స్పిల్‌వేపై గుంతలు పడిన చోట మరమ్మతులు చేస్తేనే డ్యాంకు భద్రత ఉంటుంది. లేదంటే డ్యాం రేడియల్‌ క్రస్టుగేట్లపై నుంచి నీరు కిందికి దూకే సమయంలో అది స్పిల్‌వే మీదుగా తీవ్ర ఒత్తిడితో జాలువారుతుంది. మామూలుగా సిమెంటు కాంక్రీట్‌ చేస్తే నీటి ఒత్తిడికి వెంటనే పెచ్చులూడి నీటిలో కొట్టుకుపోయే       అవకాశాలుంటాయని ఇంజినీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. 100 నుంచి 120 రోజుల్లో మరమ్మతులు పూర్తికావాల్సి ఉంది. జలాశయంలో 546 అడుగుల కన్నా తక్కువ నీటిమట్టం ఉంటేనే మరమ్మతులు సాధ్యమవుతాయి. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 535.60 అడుగులుగా ఉంది. వరదలు మొదలయ్యే లోపు పనులు పూర్తికావాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని