చిరుధాన్య కృషీవలుడి కన్నుమూత!

చిరుధాన్య పంటలకు గుర్తింపు దక్కేలా నాలుగు దశాబ్దాలకు పైగా విశేష కృషి చేసిన పీవీ సతీష్‌ (77) కన్నుమూశారు.

Published : 20 Mar 2023 04:40 IST

అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన పీవీ సతీష్‌
డీడీఎస్‌ స్థాపించి నాలుగు దశాబ్దాలపాటు సేవలు

ఈనాడు, సంగారెడ్డి, న్యూస్‌టుడే, జహీరాబాద్‌: చిరుధాన్య పంటలకు గుర్తింపు దక్కేలా నాలుగు దశాబ్దాలకు పైగా విశేష కృషి చేసిన పీవీ సతీష్‌ (77) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. స్థానికుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ (డీడీఎస్‌) ప్రధాన కార్యాలయానికి తరలించారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారు. సతీష్‌ కర్ణాటకలోని మైసూర్‌లో 1945 జూన్‌ 18న జన్మించారు. దిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ నుంచి పట్టా పొంది పాత్రికేయుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. దూరదర్శన్‌లో రెండు దశాబ్దాలపాటు పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధి, అక్షరాస్యత కార్యక్రమాల రూపకల్పన, 1970లో ఉపగ్రహ బోధన టెలివిజన్‌ ప్రయోగం (సైట్‌)లో ముఖ్యపాత్ర పోషించారు. 1980లో స్నేహితులతో కలిసి డీడీఎస్‌ను స్థాపించారు. ప్రధానంగా దళిత మహిళల సాధికారతపై దృష్టి సారించారు. మహిళాసంఘాల ఏర్పాటు, సాగులో వారే కీలకపాత్ర పోషించేలా చూడటం, చిరుధాన్యాల సాగును పెంచడం, అడవుల పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం, విద్యా నైపుణ్యాల వృద్ధి తదితర అంశాలపై పనిచేశారు. పస్తాపూర్‌ కేంద్రంగా జహీరాబాద్‌ ప్రాంతంలోని 75 గ్రామాల్లో ఎందరికో అండగా నిలిచారు. నిరక్షరాస్య మహిళలు విదేశాలకు వెళ్లి ప్రముఖుల సమక్షంలో అనర్గళంగా మాట్లాడేలా వారిలో స్ఫూర్తి నింపిన ఘనత ఆయన సొంతం. జీవవైవిధ్యం, చిరుధాన్యాల సాగు తదితర అంశాలపై సతీష్‌ జాతీయ, అంతర్జాతీయ వ్యవస్థలతో కలిసి పనిచేశారు. దేశంలోనే తొలిసారిగా గ్రామీణ మహిళలే నిర్వహించే సంఘం రేడియోను నిర్వహిస్తున్నారు. డీడీఎస్‌ ఆధ్వర్యంలో మహిళలు దశాబ్దాలుగా చేసిన కృషికి ఐరాస 2019లో ‘ఈక్వేటర్‌’ అవార్డును అందజేసింది. సతీష్‌ మృతి వార్త తెలియగానే ఆయా గ్రామాల్లోని మహిళలు పస్తాపూర్‌కు తరలివచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సంతాపం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని