మా డబ్బులేమయ్యాయో చెప్పండి

తమ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో పలువురు ఎనిమిదేళ్ల కిందట దరఖాస్తు చేసుకుని.. రుసుం చెల్లించారు. ఆ స్థలాలను క్రమబద్ధీకరించక.. ఆ సొమ్ము నేటికీ వెనక్కిరాక దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు.

Published : 20 Mar 2023 03:36 IST

జీవో 59 తిరస్కరణ దరఖాస్తుదారుల ఆవేదన
ఈసారైనా స్థలాన్ని క్రమబద్ధీకరించాలని విన్నపం

ఈనాడు, హైదరాబాద్‌: తమ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో పలువురు ఎనిమిదేళ్ల కిందట దరఖాస్తు చేసుకుని.. రుసుం చెల్లించారు. ఆ స్థలాలను క్రమబద్ధీకరించక.. ఆ సొమ్ము నేటికీ వెనక్కిరాక దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు. ఈక్రమంలో తాజాగా మళ్లీ క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడైనా నాడు చెల్లించిన రుసుమును పరిగణనలోకి తీసుకుని స్థలాలను క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు. 2014-16 మధ్య మొదటిసారి చేపట్టిన ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు జీవో 59 కింద 17,065 దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 3 వేల మంది దరఖాస్తులకు సరైన ఆధారాలు లేవంటూ రెవెన్యూశాఖ తిరస్కరించింది. వారు చెల్లించిన రిజిస్ట్రేషన్‌ రుసుం రూ.63 కోట్లకు పైగా ఉంది. దీంతో కొందరు స.హ.చట్టం కింద, ప్రజావాణిలో విజ్ఞప్తులు చేశారు. వారిలో కొందరికి మాత్రం సొమ్ములు చెల్లించారు. గతేడాది రెండోసారి ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు రెవెన్యూశాఖ దరఖాస్తులు స్వీకరించింది. అప్పుడు కూడా గతంలోని వారు కొందరు దరఖాస్తు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ఇదేకోవకు చెందిన కొందరు బాధితులు దరఖాస్తు చేసుకోగా, అధికారులు వాటిని తిరస్కరించారు. జాతీయ రహదారికి సమీపంలో ఆక్రమితస్థలం ఉందనే కారణంతో దరఖాస్తులను పక్కనపెట్టారని బాధితులు చెబుతున్నారు. వారికి పాతడబ్బు వెనక్కి ఇవ్వలేదు. ప్రస్తుతం మరోమారు ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇప్పటికైనా గతంలో చెల్లింపులు చేసిన రుసుమును పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుదారులకు స్థలాల క్రమబద్ధీకరణ చేపట్టాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ను కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు