104 పురపాలికల్లో వ్యర్థ నీటి శుద్ధి ప్లాంట్లు

రాష్ట్రంలోని 104 పురపాలక సంఘాల్లో వ్యర్థ నీటి శుద్ధి కేంద్రాల (ప్లాంట్ల) ఏర్పాటుకు పురపాలక శాఖ ప్రణాళికలు రూపొందించింది.

Published : 20 Mar 2023 03:36 IST

15 ఏళ్ల అవసరాల  మేరకు నిర్మాణం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 104 పురపాలక సంఘాల్లో వ్యర్థ నీటి శుద్ధి కేంద్రాల (ప్లాంట్ల) ఏర్పాటుకు పురపాలక శాఖ ప్రణాళికలు రూపొందించింది. రోజుకు 404 మిలియన్‌ లీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు వీలుగా వీటిని నిర్మించనున్నారు. సుమారు రూ.935 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.471 కోట్లు ఖర్చు చేయనుండగా కేంద్రం స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద రూ.464 కోట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. రానున్న 15 సంవత్సరాలు.. అంటే 2038 నాటికి ఆయా మున్సిపాలిటీల్లో పెరిగే జనాభా, నీటి అవసరాలను అంచనా వేయడంతోపాటు, వ్యర్థ నీటిని శుద్ధి చేసేందుకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు స్పష్టం చేసింది. రాష్ట్రంలో 142 పురపాలక సంఘాలున్నాయి. కేంద్రం గుర్తించిన అమృత్‌ నగరాల జాబితాలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు మరో 11 పురపాలక సంఘాలున్నాయి. అవుటర్‌ రింగు రోడ్డు పరిధిలో ఉన్న 26 పురపాలికల్లో శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జలమండలి నిర్ణయించింది. మిగిలిన 104 పురపాలక సంఘాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పురపాలక శాఖ వీటిని చేపట్టనుంది.రూ.23.8 కోట్లతో కామారెడ్డిలో 10.85 ఎంఎల్‌డీ సామర్థ్యంతో.. రూ.21.2 కోట్లతో సిరిసిల్లలో 9.56 ఎంఎల్‌డీ కేంద్రాన్ని.. రూ.20.8 కోట్లతో జహీరాబాద్‌లో 9.36 సామర్థ్యంతో నిర్మిస్తారు. అతి చిన్న శుద్ధి కేంద్రాన్ని ఆచంట పురపాలక సంఘంలో 1.38 ఎంఎల్‌డీ సామర్థ్యంతో రూ.1.6 కోట్లతో నిర్మించనున్నారు.  టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు విధివిధానాలను రూపొందిస్తున్నారు.గుత్తేదారుల ఎంపిక నాటి నుంచి ఏడాదిన్నర-రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేసేలా నిబంధన పెట్టేందుకు అధికారులు యోచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని