కేంద్ర పురస్కారాలపై గురి

జాతీయస్థాయిలో భారీగా పురస్కారాలను సాధించేలా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను చేపట్టింది.

Published : 20 Mar 2023 03:36 IST

జాతీయ ఉత్తమ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ
ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామకార్యదర్శులకు శిక్షణ షురూ

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయస్థాయిలో భారీగా పురస్కారాలను సాధించేలా రాష్ట్రంలోని గ్రామపంచాయతీలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను చేపట్టింది. కేంద్ర ప్రామాణికాలకు అనుగుణంగా పంచాయతీల రూపురేఖలు, పాలనను మార్చేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది. ఇందుకోసం పంచాయతీరాజ్‌శాఖ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌, పౌరసేవలు, పచ్చదనం, సురక్షిత తాగునీరు వంటి అంశాల ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉత్తమ పనితీరు కనబరుస్తున్న పల్లెలను ప్రోత్సహించేందుకు కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ వివిధ విభాగాల కింద ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తోంది. వాటికి పురస్కారాలను అందజేసి రూ. 40 లక్షల వరకు పారితోషికాన్ని ఇస్తోంది. ఐక్యరాజ్యసమితి తాజాగా స్థానిక సంతులిత అభివృద్ధి లక్ష్యాలు (లోకలైజేషన్‌ ఆఫ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌)- 2030 పేరిట అంతర్జాతీయంగా స్థానిక ప్రాంతాల అభివృద్ధికి ఎజెండాను ప్రకటించింది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ పంచాయతీల ఎంపికకు కొత్త ప్రామాణికాలను నిర్దేశించింది. గ్రామాల్లో పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపు, పల్లె ప్రజల ఆరోగ్యం, పిల్లలు, మహిళలకు స్నేహపూర్వక వాతావరణం, సమృద్ధిగా నీరు, స్వయంసమృద్ధ మౌలిక వసతులు, సామాజిక భద్రత, సుపరిపాలన వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. వీటి ప్రాతిపదికన జాతీయ పంచాయతీ పురస్కారాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే స్వచ్ఛసర్వేక్షణ్‌ తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికశాతం పురస్కారాలను పొందుతోంది. తాజాగా కేంద్రం ప్రకటించిన ఐరాస ఎజెండా అంశాలు తెలంగాణకు సానుకూలంగా ఉండడంతో పెద్దఎత్తున పురస్కారాలు సాధించాలని నిర్ణయించింది. కేంద్రం 17 కేటగిరీల్లో 100కి పైగా పురస్కారాలు ఇవ్వనుండడంతో పాటు.. ఐరాస ద్వారా అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి లభించే వీలున్నందున వాటి సాధనకు ప్రాధాన్యంగా ఎంచుకుంది. దీని కోసం మండల పరిషత్‌ అధికారులు, మండల పంచాయతీ అధికారులు, గ్రామ కార్యదర్శులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థలో ఇవి మొదలయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు