గణనీయంగా పెరిగిన ఆయిల్‌పాం సాగు

తెలంగాణలో ఆయిల్‌పాం సాగు గణనీయంగా పెరిగింది. 2020లో దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంట సాగుకాగా.. ఈ ఏడాది 6.95 లక్షల ఎకరాలకు చేరింది.

Updated : 20 Mar 2023 05:43 IST

2020లో లక్షన్నర ఎకరాలు.. ప్రస్తుతం 6.95 లక్షల ఎకరాల్లో పంట
అన్ని జిల్లాలకూ విస్తరణ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఆయిల్‌పాం సాగు గణనీయంగా పెరిగింది. 2020లో దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంట సాగుకాగా.. ఈ ఏడాది 6.95 లక్షల ఎకరాలకు చేరింది. మొదట్లో రెండు ఉమ్మడి జిల్లాలకే పరిమితమైన ఈ పంట.. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకూ విస్తరించింది. మూడేళ్లలో ఆయిల్‌పాం పంటను 20 లక్షల ఎకరాలకు పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించడంతో సాగులో పురోగతి కనిపిస్తోంది. వంటనూనెలకు సంబంధించి రాష్ట్రంలో పామాయిల్‌ వినియోగం అత్యధిక స్థాయిలో ఉంది. ఇందులో అధిక శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తిని భారీగా పెంచి రాష్ట్రాన్ని ఆయిల్‌హబ్‌గా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లను కేటాయించింది. రూ.250 ధర గల మొక్కను రూ.20కి సరఫరా చేయడం, 90 శాతం సబ్సిడీతో బిందుసేద్యం సౌకర్యాలు అందించడంతోపాటు మార్కెటింగ్‌ భరోసానూ కల్పించింది. ప్రస్తుతం ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఒక్కో ఎకరాకు రూ.36 వేల చొప్పున రాయితీ లభిస్తోంది. దీంతో పాటు ఆయిల్‌పాం శుద్ధి కోసం 14 కంపెనీలను సర్కారు ఎంపిక చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా సాగు..

రెండేళ్ల క్రితం వరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లోనే ఆయిల్‌పాం సాగయ్యేది. ఇప్పుడు అది దాదాపు అన్ని జిల్లాలకూ విస్తరించింది. మొత్తంగా 6.95 లక్షల ఎకరాల్లో పంట సాగవుతోంది. వరికి వాడే నీటిలో 25 శాతంతోనే దీన్ని సాగు చేయవచ్చు. అధిక దిగుబడినిచ్చే నూనె గింజల పంట కావడం, అంతర పంటకూ  అవకాశం ఉండటం కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఏటా ఎకరానికి రూ.1.50 లక్షల మేర ఆదాయం వస్తుందని అధికారులు వెల్లడించారు.


వరి కంటే మేలనే..

వరితో నష్టమే వస్తోంది. లాభాలకు భరోసా ఉన్నందున ఆయిల్‌పాంను చేపట్టాను. ఆరు ఎకరాల్లో పంట సాగు చేస్తున్నా. రాయితీ మీద మొక్కలు అందాయి. బిందుసేద్యం సమకూరింది. పెట్టుబడి సాయం కూడా అందింది. అంతరపంటగా వేరుశనగ, నువ్వులతో అదనపు ఆదాయం వస్తోంది.

 గొల్లపూడి సుబ్బారావు, ఆయిల్‌పాం రైతు, ఖానాపురం, వరంగల్‌ జిల్లా


లక్ష్యాన్ని సాధిస్తాం 

మూడేళ్లలో 20 లక్షల ఎకరాల ఆయిల్‌పాం సాగు లక్ష్యాన్ని సాధిస్తాం. యుద్ధప్రాతిపదికన సాగు పెంచేందుకు కార్యాచరణ చేపట్టగా సత్ఫలితాలనిస్తోంది. వ్యవసాయ, ఉద్యాన శాఖలు రైతులను చైతన్యపరుస్తున్నాయి. ప్రత్యేకంగా మోబైల్‌ యాప్‌ను ఏర్పాటు చేసి సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడే నూనెలను ఇక్కడే ఉత్పత్తి చేయడంతోపాటు ఎగుమతి చేయాలన్నదే మా సంకల్పం.

 వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని