23న విచారణకు రండి.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సిట్‌ నోటీసులు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సిట్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న కామారెడ్డి జిల్లా గాంధారిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మల్యాల మండలంలో గ్రూప్‌-1 పరీక్ష రాసిన 100 మందికి 103 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయన్నారు.

Published : 21 Mar 2023 05:16 IST

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో జారీ
మరికొందరు నాయకులకూ ఇచ్చేందుకు జాబితా సిద్ధం
ఈనాడు - హైదరాబాద్‌

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సిట్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న కామారెడ్డి జిల్లా గాంధారిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మల్యాల మండలంలో గ్రూప్‌-1 పరీక్ష రాసిన 100 మందికి 103 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయన్నారు. ఇదే మండలానికి చెందిన మంత్రి కేటీఆర్‌ పీఏ తిరుపతికి లీకేజీ కేసులో నిందితుడైన రాజశేఖర్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డికి సిట్‌ నోటీసు జారీ చేసింది. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లారు. ఆయన లేకపోవటంతో ఇంట్లోని వారికి నోటీసు ఇచ్చేందుకు యత్నించగా.. వాటిని స్వీకరించేందుకు వారు నిరాకరించారు.

దీంతో గోడకు నోటీసు ప్రతిని అతికించి వెళ్లిపోయారు. 103 మార్కులు సాధించిన 100 మంది వివరాలను తమకు అందించాలని సెక్షన్‌ 91 ఆఫ్‌ సీఆర్‌పీసీ కింద జారీ చేసిన నోటీసుల్లో రేవంత్‌ను పోలీసులు కోరారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలతో ఈ నెల 23న ఉదయం 11 గంటలకు హిమాయత్‌నగర్‌లోని సిట్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌.నరేందర్‌రావు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని పేర్కొన్నారు. త్వరలో పలు రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులకు సైతం నోటీసులు ఇచ్చేందుకు జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని