Supreme court: కేంద్రానికి నోటీసులిస్తాం: సుప్రీం.. వద్దు వద్దు.. సొలిసిటర్‌ జనరల్‌

రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్‌ చేస్తున్న జాప్యాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణలో  కీలక పరిణామం చోటుచేసుకుంది.

Updated : 21 Mar 2023 07:57 IST

గవర్నర్‌ వద్ద బిల్లుల పెండింగ్‌ కేసులో కీలక పరిణామం
వచ్చే సోమవారానికి వాయిదా

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్‌ చేస్తున్న జాప్యాన్ని సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణలో  కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్‌ జేబీ పర్డీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. గతంలో పంజాబ్‌కు సంబంధించి ఇలాంటి కేసు ధర్మాసనం ముందుకు వచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. దాంతో ధర్మాసనం వెంటనే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులివ్వడానికి సిద్ధమైంది. ఎవరికి నోటీసులివ్వాలని సీజీఐ జస్టిస్‌ చంద్రచూడ్‌... తెలంగాణ న్యాయవాది దుష్యంత్‌ దవేను అడగ్గా... గవర్నర్‌ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు సీజేఐ స్పందిస్తూ సాధారణంగా తాము గవర్నర్‌కు నోటీసులు జారీ చేయబోమని, అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నామని చెబుతూ.. ఉత్తర్వులు డిక్టేట్‌ చేయడానికి ఉపక్రమించారు. ఇదే విషయాన్ని కోర్టులో ఉన్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు జస్టిస్‌ చంద్రచూడ్‌ చెప్పారు. ఇందుకు ఆయన స్పందిస్తూ నోటీసులు జారీ చేయొద్దని కోరారు. అందులో కొన్ని బిల్లులు కొన్ని నెలల క్రితమే వచ్చాయని, దాని గురించి తాను వివరాలు కనుక్కొని కోర్టుకు చెబుతానని పేర్కొన్నారు. అందుకు సీజేఐ బదులిస్తూ.. తాము గవర్నర్‌కు నోటీసులు ఇవ్వడంలేదని, కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఇస్తున్నామని చెప్పారు. తాను ఇక్కడ ఉన్నందున నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని, తనకు పిటిషన్‌ కాపీ అందిస్తే చాలని తుషార్‌ మెహతా కోర్టుకు విన్నవించారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్‌ దవే స్పందిస్తూ కేసులో సొలిసిటర్‌ జనరల్‌ హాజరైన విషయాన్ని ఉత్తర్వుల్లో పేర్కొంటే చాలని, తమకు ఎలాంటి సమస్యా లేదని ధర్మాసనానికి తెలిపారు. అందుకు సీజీఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అంగీకరిస్తూ విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు