అమెరికా-భారత్‌ సంబంధాలు మరింత బలోపేతం

‘అమెరికా-భారత్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి 340 మిలియన్‌ డాలర్లతో నిర్మించిన నూతన కాన్సులేట్‌ భవనం ఓ పెట్టుబడి. రెండు దేశాల సంబంధాల్లో ఇదో కీలక మలుపు’ అని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ అన్నారు.

Published : 21 Mar 2023 04:14 IST

రానున్న రోజుల్లో వీసా ఇంటర్వ్యూల సంఖ్య పెంపు
యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌
కాన్సులేట్‌ సొంత భవనంలో కార్యకలాపాలు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: ‘అమెరికా-భారత్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి 340 మిలియన్‌ డాలర్లతో నిర్మించిన నూతన కాన్సులేట్‌ భవనం ఓ పెట్టుబడి. రెండు దేశాల సంబంధాల్లో ఇదో కీలక మలుపు’ అని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ అన్నారు. హైదరాబాద్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని నానక్‌రాంగూడలో నిర్మించిన సొంత భవన సముదాయంలో సోమవారం నుంచి కార్యకలాపాలను ప్రారంభించింది. 2008 నుంచి కాన్సులేట్‌ కార్యాలయం బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో సేవలు అందించింది. సొంత భవనంలోకి కార్యాలయాన్ని మార్చేందుకు ఈనెల 15 నుంచి కార్యకలాపాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. కార్యాలయ ప్రారంభ సూచికగా ఆమె అమెరికా జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం మాట్లాడుతూ ‘రెండు దేశాల సంబంధాలు రానున్న రోజుల్లో మరింత మెరుగుపడనున్నాయి. గత ఏడాది 18 వేల మంది విద్యార్థులకు వీసాలిచ్చాం. రానున్న రోజుల్లో దశల వారీగా వీసా అధికారులను, ఇతర సిబ్బందిని పెంచనున్నాం. కీలక అంశాలైన ఉన్నత విద్య, సాంస్కృతికం, వైద్యారోగ్యం, పర్యావరణం, మిలటరీ సహకారం తదితర రంగాలు పురోగమనంలో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో అమెరికా కంపెనీలు టెక్నాలజీ, డిఫెన్స్‌, ఏరోస్పేస్‌, ఔషధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాయి. అమెరికా, భారత్‌ మిలటరీ సంయుక్తంగా విశాఖపట్నంలోని తూర్పు నావికాదళంలో మరోదఫా సంయుక్త విన్యాసాలు చేయనున్నాయి’ అని జెన్నిఫర్‌ లార్సన్‌ పేర్కొన్నారు.

అత్యవసర సేవల కోసం అమెరికా పౌరులు  +91 040 6932 8000 కాల్‌ సెంటర్‌ నంబరును  సంప్రదించవచ్చు. అత్యవసరం కాని అంశాలపై HydACS@state.gov కు ఈ-మెయిల్‌ చేయాలి. సాధారణ సేవల కోసం +91 120 4844644,  +91 22 62011000 నంబర్లకు సంప్రదించవచ్చని కాన్సులేట్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంటర్వ్యూల కోసం అపాయింట్‌మెంట్‌ తీసుకున్నవారు నానక్‌రాంగూడలోని కాన్సులేట్‌ కార్యాలయానికి హాజరు కావాలి. వేలిముద్ర, డ్రాప్‌బాక్స్‌ సదుపాయానికి అర్హులైనవారు, వీసా ఆమోదిత పాస్‌పోర్టుల స్వీకరణ కోసం మాదాపూర్‌లోని హైటెక్‌ సిటీ మెట్రోస్టేషన్‌లోని వీసా అప్లికేషన్‌ సెంటరుకు వెళ్లాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని