ధాన్యం సేకరణకు సమాయత్తం కావాలి

రానున్న యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణకు సమాయత్తం కావాలని అధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించారు.

Published : 21 Mar 2023 04:14 IST

అధికారులకు మంత్రి గంగుల ఆదేశం
పౌర సరఫరాల సమస్యలపై 7997512345 నంబరు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: రానున్న యాసంగి సీజన్‌లో ధాన్యం సేకరణకు సమాయత్తం కావాలని అధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహించినా, రైతులకు ఇబ్బందులు ఎదురైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం సేకరణ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులతో సోమవారం ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల గుర్తింపు, జియోట్యాగింగ్‌, రవాణా, మిల్లర్ల అనుసంధానం, గన్నీ సంచులు, టార్పాలిన్లు తదితర అన్ని వనరుల్ని సంపూర్ణంగా సేకరించుకోవాలని సూచించారు. సీఎంఆర్‌ అందించడానికి సిద్ధంగా ఉన్నామని, గోదాముల సమస్యలు, హమాలీల కొరత లేకుండా చూడాలని ఎఫ్‌సీఐ అధికారులకు మంత్రి విన్నవించారు. దేశానికి అన్నం పెట్టే తెలంగాణను ప్రోత్సహించాలని కోరారు. అకాల వర్షాలు కురిసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొనుగోలుకు ఏర్పాట్లు చేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సీఎం కేసీఆర్‌కు పంపుతామని ఈ సందర్భంగా తెలిపారు. పౌర సరఫరాల శాఖ సేవలను పౌరులకు మరింత చేరువ చేసేందుకు 7997512345 ఐవీఆర్‌ఎస్‌ నంబరును మంత్రి గంగుల ప్రారంభించారు. దీని ద్వారా ఆహార భద్రత కార్డులు, ఇతర సమస్యల పరిష్కారానికి వీలు కలుగుతుందన్నారు. సమీక్షలో పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, కమిషనర్‌ వి.అనిల్‌కుమార్‌, ఎఫ్‌సీఐ డీజీఎం కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని