టీఎస్‌పీఎస్సీ వివాదాల పిటిషన్‌లపై విచారణ నేటికి వాయిదా

టీఎస్‌పీఎస్సీలో ఏఈ పోస్టుల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితుడైన తన భర్త ఎ.రాజశేఖర్‌రెడ్డిని పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ ఎ.సుచరిత, లీకేజీపై దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశించాలంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకటనర్సింగ్‌రావు.

Published : 21 Mar 2023 04:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీలో ఏఈ పోస్టుల ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితుడైన తన భర్త ఎ.రాజశేఖర్‌రెడ్డిని పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ ఎ.సుచరిత, లీకేజీపై దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశించాలంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకటనర్సింగ్‌రావు, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ‘లీకేజీలో ఇద్దరు నిందితులే ఉన్నారంటూ మంత్రి కేటీఆర్‌ విలేకరుల సమావేశంలో ప్రకటించి దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు. లీకేజీలో కేటీఆర్‌ పీఏతోపాటు ఎక్కువ మార్కులు సాధించిన మరో 20 మంది అభ్యర్థుల పాత్ర ఉంది. వీరంతా మంత్రి నియోజకవర్గానికి చెందిన వారే. అందువల్ల పారదర్శక దర్యాప్తు నిమిత్తం విచారణను సీబీఐకి అప్పగించాలి’ అని ఇదే కేసులో వెంకటనర్సింగ్‌రావు అదనపు అఫిడవిట్‌ దాఖలు చేశారు.

చిత్రహింసలకు గురి చేశారు

తన భర్త రాజశేఖర్‌ను పోలీసులు ఈ నెల 11న కస్టడీకి తీసుకున్నారని, ఆయన్ని 13న మీడియా ఎదుట హాజరు పరచినప్పుడు కుంటుతూ కనిపించారని సుచరిత పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం మధ్యాహ్నం జస్టిస్‌ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ...  రాజశేఖర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి, నివేదిక సమర్పించేలా ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది సంతోష్‌కుమార్‌ స్పందిస్తూ.. మేజిస్ట్రేట్‌ ఉత్తర్వుల ప్రకారమే వైద్య పరీక్షలు నిర్వహించినట్లు గుర్తుచేశారు. ఎలాంటి థర్డ్‌ డిగ్రీ పద్ధతులను అవలంబించరాదని మేజిస్ట్రేట్‌ ఉత్తర్వుల్లోనే పేర్కొన్నారన్నారు. నిందితులకు వైద్య పరీక్షలను నిర్వహించాలని కూడా ఆ ఉత్తర్వుల్లోనే ఉందని, అందువల్ల ప్రత్యేకంగా హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని