ఇంటర్‌ ప్రశ్నపత్రాల్లో తప్పుల పరంపర

ఇంటర్మీడియట్‌ ప్రశ్నపత్రాల్లో తప్పుల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఫస్టియర్‌ విద్యార్థులకు గణితం- 1ఏ, పొలిటికల్‌ సైన్స్‌, బోటనీ పరీక్షలు జరిగాయి.

Updated : 21 Mar 2023 06:00 IST

సమయం వృథా అవుతోందంటున్న విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రశ్నపత్రాల్లో తప్పుల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఫస్టియర్‌ విద్యార్థులకు గణితం- 1ఏ, పొలిటికల్‌ సైన్స్‌, బోటనీ పరీక్షలు జరిగాయి. గణితం తెలుగు మాధ్యమం ప్రశ్నపత్రంలో 13వ ప్రశ్నలో చతుర్ముఖి బదులు చతుర్ముఖ అని ప్రచురితమైంది. రాజనీతిశాస్త్రం తెలుగు మాధ్యమం పేపర్‌ 17వ ప్రశ్నలో సంబంధం బదులు బేధాలు అని, ఆంగ్ల మాధ్యమంలో రిలేషన్‌షిప్‌ విత్‌ బదులు డిఫరెంట్‌ ఫ్రం అని తప్పుగా ముద్రించారు. అదే ప్రశ్నకు ఉర్దూ మాధ్యమంలో కూడా తప్పు దొర్లింది. ఉర్దూ మీడియం బోటనీలో రెండు ప్రశ్నల్లో దోషాలు వచ్చాయి. వాస్తవానికి ప్రశ్నలు తప్పుగా ఉంటే వాటికి మార్కులు కలపాలి. కానీ ఇంటర్‌బోర్డు మాత్రం పరీక్షలు ప్రారంభమైన తర్వాత తప్పులను గుర్తించి ఎరాటా పేరిట ప్రశ్నల్లో సరైన పదాలు, అంకెలు ఏమిటో వివరిస్తూ వాటిని సరిచేసుకొని చదువుకోవాలని అన్ని పరీక్షా కేంద్రాలకు సమాచారం పంపుతోంది. వాటిని ముందే చెప్పాం కాబట్టి మార్కులు కలపాల్సిన అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంతోనే తప్పులు వచ్చినా ఎరాటా పంపొచ్చు అని ప్రశ్నపత్రాల రూపకల్పనలో పాల్గొంటున్న అధ్యాపకులు, బోర్డు అధికారులు అశ్రద్ధగా ఉంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

ఏకాగ్రత దెబ్బతింటోంది..

పరీక్ష గదిలో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మీడియం విద్యార్థులుంటారు. ఇతర సబ్జెక్టులను రాసే వారూ ఉంటారు. తప్పులను రాసుకొచ్చి పరీక్ష గదిలో చదివే క్రమంలో సమయం వృథాతో పాటు ఏకాగ్రత దెబ్బతింటోందని విద్యార్థులు చెబుతున్నారు. అప్పటికే ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసిన వారు మళ్లీ వాటిని కొట్టివేసి రాయాల్సి వస్తోందని చెబుతున్నారు.


నలుగురిపై కాపీయింగ్‌ కేసు

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 24,986 మంది(4.80 శాతం) పరీక్షకు గైర్హాజయ్యారు. కాపీయింగ్‌కు పాల్పడుతుండడంతో హైదరాబాద్‌లో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో ఒకరిపై మాల్‌ప్రాక్టీస్‌ కింద కేసు నమోదుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని