సమావేశ నిర్వహణకు రెండు నెలలా?

చారిత్రక కట్టడం పునరుద్ధరణ, పరిరక్షణ పనుల నిమిత్తం కట్టడంపై అధ్యయనం చేయడానికి ఎన్ని నెలల సమయం కావాలంటూ హైకోర్టు సోమవారం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Updated : 21 Mar 2023 05:58 IST

ఉదయం నుంచి కోర్టులో ఉంచితే మీకు తెలిసివస్తుంది
వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వండి
పర్యాటక శాఖ ఎండీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: చారిత్రక కట్టడం పునరుద్ధరణ, పరిరక్షణ పనుల నిమిత్తం కట్టడంపై అధ్యయనం చేయడానికి ఎన్ని నెలల సమయం కావాలంటూ హైకోర్టు సోమవారం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జనవరిలో ఆదేశిస్తే మార్చి 15న సమావేశం ఏర్పాటు చేస్తారా? సమావేశ నిర్వహణకే రెండు నెలలు పట్టిందా? అంటూ నిలదీసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని, నోటీసులు ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో ఉంచితే మీకు తెలుస్తుందని పేర్కొంది. హిల్‌పోర్టు చారిత్రక కట్టడం పరిరక్షణ చర్యలు చేపట్టకపోవడాన్ని సవాలు చేస్తూ హెరిటేజ్‌ ట్రస్ట్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది పి.అనంతనాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 15న అధికారులు సమావేశం నిర్వహించారని, కట్టడం పటిష్ఠతపై నివేదిక ఇవ్వడానికి కొంత గడువు కావాలని అధికారులు కోరారని చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. అధికారులంతా మళ్లీ హాజరుకావాలని ఆదేశిస్తే విషయ తీవ్రత ఏంటో వారికి అర్థమవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. బోగస్‌ నివేదికలతో కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నందున ఎండీకి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుని.. చివరిగా ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ మేరకు ధర్మాసనం అనుమతిస్తూ విచారణను ఏప్రిల్‌ 20కి వాయిదా వేసింది. అధ్యయన నివేదికతో వ్యక్తిగతంగా హాజరుకావాలని పర్యాటక శాఖ ఎండీని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని