2.80 లక్షల ఎకరాల్లో పంట నష్టం

రాష్ట్రంలో మూడురోజులపాటు కురిసిన భారీ వడగళ్ల వానలు, ఈదురు గాలులతో 2.80 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.

Updated : 21 Mar 2023 05:53 IST

22 జిల్లాల్లో ప్రభావం
వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మూడురోజులపాటు కురిసిన భారీ వడగళ్ల వానలు, ఈదురు గాలులతో 2.80 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 22 జిల్లాల్లో దాదాపు 96 వేల మంది రైతులు పంటలను కోల్పోయారని తెలిపింది. ఎక్కువగా మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. ఆ తర్వాత వరి, మిర్చి, వేరుసెనగ, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. మామిడితోపాటు టమాట, బెండ, ఉల్లి, బొప్పాయి, వంకాయ తదితర పంటలకూ నష్టం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ సమూహాల వారీగా అధికారులు పంట నష్టంపై నివేదికలు రూపొందించారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నష్టం వాటిల్లింది. ఆ తర్వాత కరీంనగర్‌, నల్గొండ జిల్లాలు నష్టపోయాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 57,855 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. 43,423 మంది రైతులు నష్టపోయారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ, చందుర్తి, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలలో వరి ఎక్కువగా దెబ్బతింది. చొప్పదండి, రామడుగు, గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్‌ గ్రామీణ మండలాల్లో వరి, మొక్కజొన్న పంటలను వర్షం దెబ్బతీసింది. సూర్యాపేట జిల్లాలో 14,429 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో 18 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 53 ఎకరాల్లో పెసర దెబ్బతిన్నాయి. వికారాబాద్‌ జిల్లాలో 1,516 మంది రైతులు 3,193 ఎకరాల్లో రూ.కోటి రూపాయలకుపైగా పంటను కోల్పోయారు. రంగారెడ్డి జిల్లాలో 1,923 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది.


373 శాతం అధికంగా కురిసిన వర్షం

యాసంగి పంటలకు భారీగా నష్టం

ఈనాడు, హైదరాబాద్‌: నాలుగు రోజులపాటు కురిసిన అకాల వర్షాలు యాసంగి పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వాస్తవానికి వేసవిలో ఇంత భారీ వర్షాలు అరుదుగా ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. అయితే, ద్రోణి ప్రభావంతో తాజాగా కురిసిన వానలు ఏకంగా నాలుగు రోజులపాటు ప్రభావం చూపాయి. మార్చి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం 8.6 మి.మీటర్లు. దీనికి భిన్నంగా ఏకంగా 40.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఇది 373 శాతం అధికం. నిజామాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో అధిక వర్షాలు నమోదయ్యాయి. ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలకు తోడు వడగళ్లు పడ్డాయి.  ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో వానలకుతోడు వడగళ్లు పెద్ద పరిమాణంలో పడటంతో తీవ్ర నష్టం జరిగింది. పంటలతోపాటు వాహనాల అద్దాలు, ఇంటిపైకప్పు రేకులు చాలా మండలాల్లో ధ్వంసమయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో గరిష్ఠంగా పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్‌లో 5 సెం.మీ. వర్షం కురిసింది. మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో 4, వరంగల్‌ జిల్లా నర్సంపేటలో 3 సెం.మీ. వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా ప్రాంతాల్లో వర్షం నమోదైంది. రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా శీతల వాతావరణం కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు