రైతులకు అన్ని విధాలా భరోసా కల్పిస్తున్నాం

అకాల వర్షాలతో పంట నష్టం కలిగిన ప్రాంతాల్లో రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Published : 21 Mar 2023 04:52 IST

రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాల విమర్శలు: నిరంజన్‌రెడ్డి  

ఈనాడు, హైదరాబాద్‌: అకాల వర్షాలతో పంట నష్టం కలిగిన ప్రాంతాల్లో రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. విపక్షాలు రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘వర్షాలు కురిసిన 24 గంటల్లోపే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వికారాబాద్‌ జిల్లాలో పర్యటించాం. దెబ్బతిన్న పంటలను అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించాం. వివిధ ప్రాంతాల్లో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పంట నష్టం జరిగిన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల మూలంగా ఈ యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, సాగునీటి కల్పనతో అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అకాల వర్షాలతో తలెత్తిన పంట నష్టాన్ని కాంగ్రెస్‌ రాజకీయం చేయడం దురదృష్టకరం. వారి పాలనలో రైతులు పడ్డ గోస గుర్తులేదా?. ధాన్యం కొనం అని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెబితే ఒక్క కాంగ్రెస్‌ నేత కూడా ఎందుకు ప్రశ్నించలేదు? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసే  దీక్షలను రైతులు గమనిస్తున్నారు’’ అని నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని