సంస్కరణల బాటలో టీఎస్‌పీఎస్సీ

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ భారీ సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది. కమిషన్‌ను పటిష్ఠం చేయడంతో పాటు భవిష్యత్తులో లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనుంది.

Published : 22 Mar 2023 05:11 IST

పటిష్ఠ సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థ
కమిషన్‌ ఉద్యోగాలకు ప్రత్యేక నియామకాలు
ప్రభుత్వానికి ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్‌పీఎస్సీ భారీ సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది. కమిషన్‌ను పటిష్ఠం చేయడంతో పాటు భవిష్యత్తులో లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనుంది. టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగుల నియామకాలు, ఉద్యోగుల ప్రవర్తన నియామావళి, పోటీ పరీక్షల నిర్వహణ, సైబర్‌ సెక్యూరిటీ వరకు భారీ మార్పులు జరగనున్నాయి. గత మూడు రోజులుగా కమిషన్‌ ఈ మేరకు చర్చలు నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగ పోటీ పరీక్షలు వేగంగా నిర్వహించి, వెంటనే ఫలితాలు వెల్లడించేందుకు వీలుగా స్పెషలైజేషన్‌ పోస్టుల పరీక్షలన్నీ ఆన్‌లైన్లో నిర్వహించాలని భావిస్తోంది. ఈ నిర్ణయాలన్నీ తక్షణం అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేయనుంది. సంస్కరణల్లో చేయాల్సిన చట్టసవరణలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనుంది.

ఇవీ సంస్కరణలు..

టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగ నియామకాలు ప్రత్యేకంగా ఉంటాయి. అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. విద్యార్హతల్లో 70 శాతానికి మించి మార్కులు, సంబంధిత సబ్జెక్టుల్లో (ఐటీ, న్యాయవిద్య తదితర స్పెషలైజేషన్లు) నిపుణులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు కనీస అర్హత పీజీగా ఉంటుంది. ఇకనుంచి టీఎస్‌పీఎస్సీలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు ఉండవు. సహాయ సెక్షన్‌ అధికారి నుంచి పోస్టులు ప్రత్యక్ష నియామకం ద్వారానే మొదలవుతాయి. ఈ ఉద్యోగులకు వేతన స్కేలు సాధారణ అధికారుల కన్నా ఎక్కువగా ఉంటుంది. కమిషన్‌ ఉద్యోగుల ఎంపికలో ప్రిలిమినరీ, ప్రధాన పరీక్షలు ఉంటాయి. ప్రిలిమినరీలో మెరిట్‌ సాధించిన అభ్యర్థుల్లో 1:5 చొప్పున ఎంపిక చేసి ప్రధాన పరీక్షలు నిర్వహిస్తారు.

* టీఎస్‌పీఎస్సీలో నియమితులైన ఉద్యోగులు కమిషన్‌ నిర్వహించే ఇతర ఉద్యోగ పరీక్షలకు హాజరుకారాదు. ఒకవేళ హాజరవ్వాలనుకుంటే కమిషన్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. అలా పరీక్షలు రాసేవారు శాశ్వత ఉద్యోగులైతే పరీక్ష తేదీకి మూడు నెలలు, పరీక్ష తరువాత నెల రోజులు తప్పనిసరిగా సెలవుల్లో వెళ్లాలి. కమిషన్‌ కార్యకలాపాల్లో వారు పాలుపంచుకోరాదు. ఎవరితోనూ మాట్లాడకూడదు. సెలవులు ఉంటే వేతనం వస్తుంది. లేకుంటే జీతం నష్టం (లాస్‌ ఆఫ్‌ పే) కింద వెళ్లాలి. పొరుగుసేవల ఉద్యోగులకూ ఇదే నిబంధన వర్తిస్తుంది.

* కమిషన్‌లో సైబర్‌ సెక్యూరిటీని మరింత పటిష్ఠం చేయనున్నారు. నిపుణుల్ని శాశ్వత ప్రాతిపదికన నియమించి, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక మార్పులు చేయాలని కమిషన్‌ నిర్ణయించింది. ఉద్యోగులు ఒక సెక్షన్‌ నుంచి మరో సెక్షన్‌కు యాక్సెస్‌ కంట్రోల్‌ ద్వారానే వెళ్లాలి. ఇప్పటికే పరీక్షలు, కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్లకు ఈ సదుపాయాన్ని కమిషన్‌ పూర్తిచేసింది. మిగతా సెక్షన్లకు త్వరలో ఈ సదుపాయం రానుంది. తద్వారా ఏయే సెక్షన్లకు ఎవరు వెళ్లారనే విషయాలు వెంటనే ఉన్నతాధికారులకు తెలుస్తాయి. అక్కడ ఏం చేస్తున్నారన్న విషయాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవుతాయి.

* టీఎస్‌పీఎస్సీలో కారుణ్య విధానంలో నియామకాలు ఉండవు. పటిష్ఠ పోటీ మధ్య ఎంపికైన ఉద్యోగులే ఉంటారు. ఒకవేళ కారుణ్య నియామకం కింద ఎవరైనా వస్తే, వారిని సెలక్షన్‌ కమిటీ పూర్తిస్థాయి విచారణ జరిపిన తరువాత సంతృప్తికరమైన నివేదిక వస్తే పరిశీలిస్తారు. లేకుంటే ఇతర ప్రభుత్వ శాఖలకు సిఫారసు చేస్తారు.

* వీలైనన్ని పరీక్షలు కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. ప్రస్తుతం 25 వేల మంది అభ్యర్థులున్న పరీక్షలు మాత్రమే సీబీఆర్‌టీ విధానంలో నిర్వహిస్తోంది. కానీ రాష్ట్రంలో 50 వేల మంది అభ్యర్థులకు సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు వనరులు ఉన్నాయి. వీటిని పూర్తిగా వినియోగించుకునేందుకు ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూలతో త్వరలో సమావేశం నిర్వహించనుంది.

* టీఎస్‌పీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేటు ఇంజినీరింగ్‌, విద్యాసంస్థలను పరీక్ష కేంద్రాలుగా ఉపయోగించుకుంటోంది. ఇందుకోసం ఆయా విద్యాసంస్థల్ని బతిమలాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. రెండు రోజుల ముందు కంప్యూటర్లు, ఆవరణలను కమిషన్‌ పరిధిలోకి ఇచ్చేందుకు ఆయా విద్యాసంస్థలు అంగీకరించడం లేదు. ఇక నుంచి కమిషన్‌ ఏవైనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన వెంటనే ఆయా విద్యాసంస్థలను నేరుగా తమ అధీనంలోకి తీసుకునేలా, విద్యాసంస్థలు నిరాకరించడానికి వీల్లేకుండా చట్టసవరణలు చేయనుంది.

* కమిషన్‌లో ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని మరింత పటిష్ఠం చేయనుంది. అభ్యర్థులు ఆ విభాగంలో తమ ఫిర్యాదులు అందించాలి. అవసరమైతే మెయిల్‌, ఇతర విధానాలు వినియోగించవచ్చు. ఫిర్యాదు వచ్చిన వెంటనే సంబంధిత విభాగాన్ని సంప్రదించి ఆ అభ్యర్థికి సమాచారం తెలియజేస్తారు. ఇక నుంచి అభ్యర్థులు నేరుగా సెక్షన్లలోకి వెళ్లేందుకు అనుమతి లేదు. కమిషన్‌ కార్యదర్శి, ఛైర్మన్‌ లిఖితపూర్వక అనుమతి లేనిదే లోపలికి అనుమతించరు.

* కమిషన్‌లో ఉద్యోగ బాధ్యతల రీత్యా అనుమతి పొందినవారు తప్ప.. ఇతర ఉద్యోగులెవరూ తమ వ్యక్తిగత ఫోన్లను కార్యాలయంలోకి తీసుకురావడానికి వీల్లేదు. వారు వాటిని సెక్యూరిటీ కార్యాలయం వద్ద వదిలేసి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని