MLC Kavitha: సుదీర్ఘ విచారణే..!

దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వరుసగా రెండో రోజూ భారాస ఎమ్మెల్సీ కవితను పది గంటలపాటు విచారించింది. ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఆమె రాత్రి 9.30 గంటలకు పిడికిలి బిగించి అభివాదం చేస్తూ, విజయచిహ్నం చూపుతూ బయటికొచ్చారు.

Updated : 22 Mar 2023 07:39 IST

రెండో రోజూ కవితను 10 గంటలపాటు విచారించిన ఈడీ

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వరుసగా రెండో రోజూ భారాస ఎమ్మెల్సీ కవితను పది గంటలపాటు విచారించింది. ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఆమె రాత్రి 9.30 గంటలకు పిడికిలి బిగించి అభివాదం చేస్తూ, విజయచిహ్నం చూపుతూ బయటికొచ్చారు. దీంతో ఇప్పటివరకు మూడు రోజుల్లో విచారణ 29 గంటలపాటు సాగినట్లయింది. తదుపరి విచారణ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ విషయం తర్వాత చెబుతామని ఈడీ అధికారులు అన్నట్లు భారాస వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం విచారణ ఉండదని సమాచారం. ఈడీ గత ఏడాది నవంబరు 30వ తేదీన కోర్టుకు సమర్పించిన అమిత్‌ అరోడా రిమాండ్‌ నివేదికలో మద్యం కేసు నిందితులు/అనుమానితులుగా ఉన్న 36 మంది ఏడాది కాలంలో కనీసం 170 ఫోన్లను ధ్వంసం చేయడమో, మార్చడమో జరిగినట్లు పేర్కొంది. దర్యాప్తును సీబీఐకి అప్పగించిన వెంటనే ఇందులో భాగస్వామ్యం ఉన్నవారు డిజిటల్‌ సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం మొదలుపెట్టినట్లు తెలిపింది. ఇందులో కవితకు చెందిన పది ఫోన్లు ఉన్నట్లు పేర్కొంది. వాటిలో నాలుగు ఫోన్లను ఆమె 2022 ఆగస్టు 9, 22, 23 తేదీల్లో మార్చడమో/ధ్వంసం చేయడమో జరిగినట్లు ఆ నివేదికలో పేర్కొంది. ఈ ఆరోపణలను ఖండిస్తూ కవిత తాను ఉపయోగించిన ఫోన్లను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి సమర్పించారు. వాటిలో ఉపయోగించిన ఫోన్‌ నంబర్లు, ఆ ఫోన్ల ఐఎంఈఐ నంబర్లను వాటిపై అతికించి మరీ ఇచ్చారు. మంగళవారం నాటి విచారణలో ఈ అంశంపైనే ఈడీ అధికారులు ప్రశ్నించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇతర నిందితులతో కలిపి విచారించారా? అన్న దానిపై స్పష్టత లేదు. అంతర్గతంగా జరిగిన విచారణ వివరాలేవీ బయటకు రాలేదు. అంతకుముందు ఉదయం కవిత.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికార నివాసం నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ, విజయచిహ్నం చూపుతూ భర్తతో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. రాత్రి 7.45 గంటల సమయంలో భారాస లీగల్‌ విభాగం ప్రధాన కార్యదర్శి సోమభరత్‌ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. మూడు రోజుల విచారణలో ఆమె ఇచ్చిన వాంగ్మూలాలపై సంతకాలు చేయించుకొనే క్రమంలో ఆథరైజేషన్‌ కోసం న్యాయవాది అయిన సోమభరత్‌ను పిలిపించినట్లు తెలుస్తోంది. వరుసగా విచారణకు పిలుస్తున్న ఈడీ ఎప్పుడేం చేస్తుందోనన్న ఉత్కంఠ నెలకొన్న సమయంలో ఆమె మూడో రోజూ విచారణ ముగించుకొని బయటికి రావడంతో భారాస శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి. ఈడీ సమన్లను సవాల్‌ చేస్తూ ఆమె దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ శుక్రవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని