Hyderabad: నడుస్తున్న వ్యాను నుంచి దూకి.. పలువురి ప్రాణాలు కాపాడిన ఎస్సై

అదుపు తప్పి రోడ్డుపై పరుగులు తీస్తున్న వాహనాన్ని అపేందుకు ఆ ఎస్సై సాహసం చేశారు. ప్రాణాలకు తెగించి వాహనం వెనుక నుంచి దూకి, దాని ముందుకు పరుగెత్తి నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది.

Updated : 22 Mar 2023 08:09 IST

వాహనంలో ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: అదుపు తప్పి రోడ్డుపై పరుగులు తీస్తున్న వాహనాన్ని అపేందుకు ఆ ఎస్సై సాహసం చేశారు. ప్రాణాలకు తెగించి వాహనం వెనుక నుంచి దూకి, దాని ముందుకు పరుగెత్తి నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. అందులో ప్రయాణిస్తున్న 16 మంది ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఏబీవీపీ విద్యార్థులు ప్రగతి భవన్‌ ముట్టడికి రాగా, పోలీసులు అరెస్టు చేసి డీసీఎం వ్యాన్‌లో ఎక్కించారు. వారికి కాపలాగా బంజారాహిల్స్‌కు చెందిన ఎస్సై కరుణాకర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది వ్యానులో కూర్చున్నారు. వాహనం ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ దిగి నెక్లెస్‌రోడ్డు వైపు వెళుతుండగా.. డ్రైవర్‌ రమేష్‌కు ఫిట్స్‌ రావడంతో వాహనం అదుపు తప్పి అటూ ఇటూ తిరుగుతూ వెళ్లడాన్ని వెనుక ఉన్న ఎస్సై కరుణాకర్‌రెడ్డి గమనించారు. వెంటనే ఆయన నడుస్తున్న వాహనం నుంచి కిందకు దూకేశారు. అదే ఊపులో వ్యాను ముందుకు పరుగుతీశారు. డోర్‌ తీసి, స్టీరింగ్‌ పట్టుకోవడం, వెంటనే బ్రేక్‌ వేయడంతో అది ఒక్క కుదుపుతో పూలకుండీని ఢీకొట్టి పక్కన ఉన్న గ్రిల్స్‌ను తాకి ఆగిపోయింది. ఫ్లైఓవర్‌పై ఎడమ వైపు వెళ్లి ఉంటే వ్యాన్‌ కిందకు పడిపోయేదని, కుడివైపు వెళ్తే వాహనాలను ఢీకొట్టేదని.. మొత్తానికి పెద్ద ప్రమాదం తప్పిందని వాహనదారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న సైఫాబాద్‌ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వాహనాన్ని తొలగించి, అరెస్టు చేసిన వారిని మరో వాహనంలో తరలించారు. ఈ ఘటనలో ఎస్సైతో పాటు హోంగార్డు రమేష్‌, మరో కానిస్టేబుల్‌కు గాయాలవ్వగా.. యశోద ఆసుపత్రిలో చికిత్స అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని