లొసుగులు.. లోపాలు

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌  పరీక్షలు నిర్వహించే తీరు, ముఖ్యంగా ప్రశ్నపత్రాలను గోప్యంగా ఉంచే విధానం కమిషన్‌లో లోపభూయిష్టంగా ఉందని సిట్‌ అధికారులు గుర్తించారు.

Published : 22 Mar 2023 04:13 IST

టీఎస్‌పీఎస్సీలో లోపభూయిష్ఠంగా ప్రశ్నపత్రాల గోప్యత విధానం
కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లోకి ప్రవీణ్‌ను ఎవరు అనుమతించారు?
సంబంధిత అధికారుల్నీ ప్రశ్నించేందుకు సిట్‌ సమాయత్తం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌  పరీక్షలు నిర్వహించే తీరు, ముఖ్యంగా ప్రశ్నపత్రాలను గోప్యంగా ఉంచే విధానం కమిషన్‌లో లోపభూయిష్టంగా ఉందని సిట్‌ అధికారులు గుర్తించారు. గ్రూప్‌-1 పరీక్ష రాసేందుకు అనుమతి పొందిన ప్రవీణ్‌ కార్యాలయంలోకి రావడానికి, కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లోకి వెళ్లడానికి ఎలా? ఎవరు అనుమతించారన్నదీ ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నింటినీ క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్న సిట్‌ అధికారులు.. ప్రశ్నపత్రాల తయారీ నుంచి వాటిని భద్రపర్చడంలో, పరీక్షల నిర్వహణతో సంబంధం ఉన్న వారందర్నీ ప్రశ్నించాలని భావిస్తున్నారు.

ఎస్సెమ్మెస్‌ ఎలర్ట్‌ను డియాక్టివేట్‌ చేసినా..

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత రోజుల్లో ప్రశ్నపత్రాలు లీక్‌ కాకుండా అనేక చర్యలు తీసుకోవచ్చు. కానీ, కమిషన్‌ కార్యాలయంలో ఇలాంటివేవీ కనిపించలేదని తెలుస్తోంది. ఉదాహరణకు ప్రశ్నపత్రాలను కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లోని కంప్యూటర్లో భద్రపరుస్తారు. ఆ సెక్షన్‌ ఇన్‌ఛార్జి తప్ప ఇతరులు ఎవరూ దీన్ని తెరిచే అవకాశం లేకుండా డిజిటల్‌ లాక్‌ చేస్తారు. ఎవరైనా తెరవాలని ప్రయత్నిస్తే వెంటనే సంబంధిత ఇన్‌ఛార్జికి ఎస్సెమ్మెస్‌ ఎలర్ట్‌ వస్తుంది. దాదాపు సంవత్సరం క్రితం నెట్‌వర్క్‌ అప్‌గ్రెడేషన్‌ జరిగినప్పుడే ఈ ఎలర్ట్‌ విధానాన్ని రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌లు డీయాక్టివేట్‌ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా డైనమిక్‌ ఐపీని స్టాటిక్‌ ఐపీగా మార్చారు. కానీ, ప్రశ్నపత్రాలు లీకయ్యేవరకూ, పోలీసులకు ఫిర్యాదు వచ్చేవరకూ కమిషన్‌ కార్యాలయంలో ఎవరూ గుర్తించలేకపోయారు. పరీక్షల నిర్వహణపై అజమాయిషీ అనేక మంది చేతుల్లో ఉంటుంది. సాంకేతికంగా జరిగిన మార్పులు, రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌ల కదలికలను ఎవరూ అనుమానించకపోవడం అతిపెద్ద తప్పిదంగా భావిస్తున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసేందుకు అనుమతి పొందిన ప్రవీణ్‌ను కార్యాలయంలో యథేచ్ఛగా తిరిగేందుకు అనుమతించడం మరో పెద్ద వైఫల్యమని సిట్‌ అధికారులు భావిస్తున్నారు. కమిషన్‌ కార్యాలయంలో పనిచేసేవారు ఎవరైనా ఈ పోటీ పరీక్షలను రాయాలంటే వారిని కీలకమైన కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా ఇతర విభాగాలకు బదిలీ చేయాలి. ఈ నిబంధనలను ఎవరూ పట్టించుకోలేదని తేలింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా వచ్చిందని పరీక్ష రాసిన తర్వాత అనేక మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న వారికీ 100 మార్కులు దాటడం గగనమైంది. అలాంటిది సెలవు పెట్టకుండా.. కమిషన్‌ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తూ రాసిన ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. అయినప్పటికీ అధికారులు ఎవరికీ అనుమానం రాకపోవడాన్ని సిట్‌ అధికారులు ఎత్తిచూపుతున్నారు.

కంప్యూటర్‌ కార్యకలాపాలకు రాజశేఖర్‌రెడ్డిపైనే ఆధారం

కమిషన్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ వ్యవస్థ ఘోరంగా ఉందని, కొద్దిగా ప్రయత్నిస్తే నెట్‌వర్క్‌లోకి చొరబడటం పెద్ద సమస్య కాదని.. దాంతోపాటు ఇక్కడ పనిచేస్తున్న ఎవరికీ సాంకేతిక అంశాలపై సరైన పరిజ్ఞానం లేదని సిట్‌ అధికారులు గుర్తించినట్లు సమాచారం. కంప్యూటర్‌ కార్యకలాపాలకు సంబంధించిన ప్రతి చిన్న విషయానికీ రాజశేఖర్‌రెడ్డిపై ఆధారపడేవారని.. ఇది కూడా పెద్ద తప్పిదమని అధికారులు భావిస్తున్నారు. ఇన్ని లోపాలు ఉండబట్టే రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌లు తమ పథకం అమలు చేసి ప్రశ్నపత్రాలను కొల్లగొట్టారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. వాటిని అమ్ముకోవడంలో తేడా వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు వచ్చి ఉండకపోతే ఈ వ్యవహారమే బయటపడేది కాదని, భవిష్యత్తులో జరిగే పరీక్షల ప్రశ్నపత్రాలనూ అమ్ముకుని సొమ్ము చేసుకునేవారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని