బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలి

వ్యవసాయ రంగానికి రుణాలివ్వడంలో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించి, అన్నదాతకు అండగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు.

Published : 22 Mar 2023 04:13 IST

రైతులకు 62 శాతమే పంట రుణాలా?
వ్యవసాయధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ రంగానికి రుణాలివ్వడంలో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించి, అన్నదాతకు అండగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. 2022-23 సంవత్సరానికి వ్యవసాయ రంగానికి బ్యాంకుల రుణాల లక్ష్యంలో 62 శాతమే చేరుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనను బ్యాంకులు ప్రోత్సహించాలని, అడిగిన వారందరికీ రుణసాయం చేయాలని, ఆయిల్‌పామ్‌ సాగుకు పెట్టుబడి సాయం అందిస్తూ రైతులకు అండగా నిలవాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘‘అన్నదాతకు రుణసాయంలో బ్యాంకులు వంద శాతం లక్ష్యం చేరుకోవడం లేదు. దీనిపై సమీక్షించుకోవాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో దేశంలో తెలంగాణ అగ్రగామి వ్యవసాయ రాష్ట్రంగా ఎదిగింది. వ్యవసాయ ఉత్పత్తుల సగటులో దేశంలో మొదటి స్థానంలో ఉన్నాం. రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు శ్రీకారం చుట్టాం. ప్రతి జిల్లాలో ఆహారశుద్ధి పరిశ్రమల ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేస్తున్నాం. పరిశ్రమల స్థాపనకు పెద్దఎత్తున రైతులు ముందుకొస్తున్నారు. వారికి బ్యాంకులు ప్రోత్సాహమందించాలి. పాడి రంగాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చే కృషిలో భాగస్వామిగా మారాలి. గత తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వేరుసెనగ పంట ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులకు అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో డిమాండ్‌ ఉంది. నాణ్యమైన వేరుసెనగ సాగుకు తెలంగాణ.. అందులోనూ దక్షిణ ప్రాంతం అనుకూలం. అటువంటి పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకులు ప్రోత్సాహమందించాలి’’ అని నిరంజన్‌రెడ్డి కోరారు. సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ, ఆర్థికశాఖల కార్యదర్శులు రఘునందన్‌రావు, రొనాల్డ్‌ రాస్‌, ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు అమిత్‌ జింగ్రాన్‌, నాబార్డ్‌ జీఎం వై.హరగోపాల్‌, ఆర్‌బీఐ డీజీఎం కేఎస్‌ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని