సహాయ ఆచార్యులను నెలాఖరులోగా నియమించాలి

బోధనాసుపత్రుల్లో 1,442 సహాయ ఆచార్యుల నియామక ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.

Updated : 22 Mar 2023 04:40 IST

మంత్రి హరీశ్‌రావు
ఉద్యోగుల ఆరోగ్య పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలని ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: బోధనాసుపత్రుల్లో 1,442 సహాయ ఆచార్యుల నియామక ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఆరోగ్యశ్రీ అమలు, పురోగతిపై మంత్రి మంగళవారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఆన్‌లైన్‌(జూమ్‌) ద్వారా సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన మేరకు పేదలకు వైద్య ఖర్చుల భారం లేకుండా చేసి నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో కంటే ఆరోగ్యశ్రీ కేసులు పెరగడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజారోగ్య సంచాలకుడి పరిధిలోనూ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభం మంచి పరిణామమని అన్నారు. కొత్త వైద్యకళాశాలలు, అదనంగా పీజీ సీట్లు రావడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపడడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు. ఉద్యోగులు, పాత్రికేయుల ఆరోగ్య పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉంచాలని, వెల్‌నెస్‌ సెంటర్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో వైద్య,ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాచ్చి, డీఎంఈ రమేష్‌రెడ్డి, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ కిట్‌తో 95 శాతం ఆసుపత్రి కాన్పులు: సీఎస్‌

రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలతో ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో గణనీయమైన మెరుగుదల ఉందని సీఎస్‌ శాంతికుమారి అన్నారు. వైద్య,ఆరోగ్యశాఖపై మంగళవారం ఆమె ప్రత్యేకంగా సమీక్షించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఆసుపత్రుల్లో ప్రసవాలు 95 శాతానికి పెరిగాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 నుంచి 61 శాతానికి పెరిగాయని, పీహెచ్‌సీల్లో ప్రసవాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌తోనూ సత్ఫలితాలు వస్తున్నాయని, దీన్ని త్వరలో అన్ని జిల్లాల్లో అమలు చేస్తామన్నారు. బస్తీ దవాఖానాల ద్వారా ప్రత్యేక సేవలు అందుతున్నాయని, మరో 46 త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని