టీఎస్‌పీఎస్సీలో 8 మంది ఉద్యోగులకు నోటీసులు?

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో పూటకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. మంగళవారం సిట్‌ పోలీసుల దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Updated : 22 Mar 2023 06:55 IST

వారిలో కొందరికి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 100కు పైగా మార్కులు
నాలుగోరోజు కస్టడీలో  వెలుగుచూసిన మరిన్ని వివరాలు
కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ను విచారించిన అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో పూటకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. మంగళవారం సిట్‌ పోలీసుల దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిందితుల మొబైల్‌ఫోన్లలోని కాల్‌డేటా, వాట్సప్‌ గ్రూపులు, చాటింగ్‌ ఆధారంగా నిఘా బృందాలు వారి గురించి వాకబు చేస్తున్నాయి. వీరిలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల జాబితాను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. కమిషన్‌లోని వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 8 మంది ఉద్యోగులు గతేడాది అక్టోబరులో జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరైనట్లు తాజాగా గుర్తించారు. వీరిలో కొందరు 100కు పైగా మార్కులు సాధించినట్లు నిర్ధారణకు వచ్చారు. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్‌ అధికారులు నోటీసులు జారీచేసేందుకు సిద్ధమయ్యారని  తెలుస్తోంది.

లీకేజీ ఆధారాలపై దృష్టి

ఈ కేసులో 9 మంది నిందితుల నుంచి నాలుగోరోజు పోలీసు కస్టడీలో కీలక సమాచారం రాబట్టారు. ప్రశ్నపత్రాలు ఎవరికి విక్రయించారనే అంశంపై దృష్టిసారించారు. సిట్‌ పోలీసులు మంగళవారం నిందితుల నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి వివరాలు రాబట్టినట్లు సమాచారం. ఉదయం రేణుక రాథోడ్‌, డాక్యానాయక్‌ దంపతులను మహబూబ్‌నగర్‌ జిల్లా పగిడ్యాల్‌ పంచగల్‌ తండాలోని వారి నివాసానికి తీసుకెళ్లారు. అనంతరం బండ్లగూడ జాగీర్‌ సన్‌సిటీలో ఈ దంపతులు ఉంటున్న ఇంట్లోనూ సోదాలు జరిపారు. మరో బృందం బడంగ్‌పేట్‌, మణికొండ ప్రాంతాల్లోని ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి నివాసాల్లో నిర్వహించిన తనిఖీల్లో ప్రశ్నపత్రాలు, పెన్‌డ్రైవ్‌ లభించినట్లు సమాచారం. మరోవైపు కమిషన్‌ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను సైబర్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది కంప్యూటర్ల మరమ్మతు సమయంలో నిందితులు వాడిన సాఫ్ట్‌వేర్‌, మార్చిన ఐడీలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. నెట్‌వర్క్‌ అడ్మిన్‌గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి మొబైల్‌ఫోన్లలో వాట్సప్‌ గ్రూపులను పరిశీలిస్తున్నారు. గ్రూపు సభ్యుల్లో పోటీ పరీక్షలకు సిద్ధమైన వారి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిందితుల ద్వారా వారి చిరునామాలను సేకరిస్తున్నారు. అనంతరం వారి ఇళ్లకు వెళ్లి విచారించడమా! నోటీసులు జారీ చేయడమా! అనే దానిపై గురువారం స్పష్టతకు వస్తామని ఓ పోలీసు అధికారి తెలిపారు. తాము పట్టుబడినా ఎక్కడా సాక్ష్యాలు చిక్కకుండా ప్రధాన నిందితులు ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డిలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు విశ్వసనీయ సమాచారం. పెన్‌డ్రైవ్‌లకు పాస్‌వర్డ్స్‌ ఉంచిన నిందితులు.. పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పుడు పాస్‌వర్డ్స్‌ మరచిపోయామంటూ ఏమార్చే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

శంకరలక్ష్మిని విచారించిన సిట్‌

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కమిషన్‌ కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ శంకరలక్ష్మిని సిట్‌ పోలీసులు విచారించారు. మంగళవారం రాత్రి ఆమెను పోలీసు భద్రత మధ్య హిమాయత్‌నగర్‌లోని సిట్‌ కార్యాలయానికి రప్పించారు. ప్రశ్నపత్రాలను కొట్టేసేందుకు నిందితులు ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డిలు కమిషన్‌లోని ఆమె కంప్యూటర్‌ను వినియోగించినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిపారు. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను శంకరలక్ష్మి డైరీ నుంచి తీసుకున్నట్లు చెప్పారు. దీనిపై గతంలోనే ఆమె స్పందించారు. డైరీలో తాను ఎలాంటి యూజర్‌ఐడీ, ఐడీ రాయలేదని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సిట్‌ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. రెండోసారి ఆమెను కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. సుమారు గంటపాటు ప్రశ్నించి ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం. బయటకు వచ్చాక ఆమె మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. విచారణకు శంకరలక్ష్మితో పాటు మరో ఉద్యోగి హాజరైనట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని