బయటపడుతున్న ఇంటి దొంగలు

రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఇంటిదొంగలు బయటపడుతున్నారు. సిట్‌ పోలీసులు బుధవారం మరో ముగ్గురు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులను అరెస్టు చేశారు.

Published : 23 Mar 2023 05:35 IST

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ముగ్గురు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల అరెస్టు
మరో 40 మంది సిబ్బందిని ప్రశ్నించనున్న పోలీసులు?

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఇంటిదొంగలు బయటపడుతున్నారు. సిట్‌ పోలీసులు బుధవారం మరో ముగ్గురు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులను అరెస్టు చేశారు. కమిషన్‌లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 20 మంది గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష రాయగా 8 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరిలో దామెర రమేష్‌కుమార్‌, షమీమ్‌, సురేష్‌లు 100కు పైగా మార్కులు సాధించారు. సురేష్‌ను రాజశేఖర్‌రెడ్డికి స్నేహితుడిగా గుర్తించారు. వందకు పైగా మార్కులు తెచ్చుకున్న ఈ ముగ్గురూ లీకైన ప్రశ్నపత్రాల ద్వారానే సాధించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో 12 మందిపై కేసులు నమోదు చేశారు. గతేడాది అక్టోబరులో నిర్వహించిన గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షలో 121 మంది అభ్యర్థులు వంద, ఆ పైగా మార్కులు సాధించారు. కాగా ఇప్పటికే కస్టడీలో ఉన్న 9 మంది నిందితుల నుంచి బుధవారం అయిదోరోజు సిట్‌ పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. వివరాలను క్రోడీకరిస్తున్నారు.రాజశేఖర్‌రెడ్డి వాట్సప్‌ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నవారిని ఫోన్‌ ద్వారా సంప్రదించారు. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా! ఇప్పటికే రాశారా!.. అనే వివరాలు నమోదు చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.  విచారణ అనంతరం కింగ్‌కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో 9 మంది నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. సాయంత్రం మధ్యమండలం డీసీపీ కార్యాలయంలోని సెల్‌కు తరలించారు. కమిషన్‌లోని సుమారు 40 మంది ఉద్యోగులను పోలీసులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. గురువారంతో నిందితుల 6 రోజుల పోలీసుల కస్టడీ ముగియనుండటంతో మరోసారి కస్టడీకి తీసుకునేందుకు సిట్‌ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయాలనుకుంటున్నట్టు తెలిసింది.

ముందు కొందరికే.. తర్వాత ఎందరికో!

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం మొదట్లో ఒకరిద్దరికి మాత్రమే పరిమితం అనుకున్నప్పటికీ సిట్‌ దర్యాప్తు జరుగుతున్న కొద్దీ గొలుసుకట్టు జాబితా బయటపడుతోంది. మాస్‌కాపీయింగ్‌ తరహాలో జరిగితే అసలుకే మోసం వస్తుందన్న ఉద్దేశంతో నిందితులు చాలా జాగ్రత్తగా బాగా తెలిసిన వారికి మాత్రమే ప్రశ్నపత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారి నుంచి మరికొందరికి చేరినట్లు అనుమానిస్తున్న సిట్‌ అధికారులు ఇప్పుడు ఇందులో భాగస్వాములైన వారందరినీ గుర్తించే పని మొదలుపెట్టారు. వాస్తవానికి మార్చి 5న ఏఈ పరీక్ష ముగిసిన వెంటనే ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి పోలీసులకు ఉప్పందినట్లు తెలుస్తోంది. నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డి దొంగచాటుగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయం కంప్యూటర్‌ వ్యవస్థలోకి చొరబడి ప్రశ్నపత్రాలను కొట్టేసినట్లు సిట్‌ విచారణలో నిర్ధారణ అయింది. అయితే వీటిని ఎవరెవరికి అమ్మారన్న దానిపై మాత్రం పూర్తి స్పష్టత రావడంలేదు. మార్చి 12న టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ ఆ ప్రశ్నపత్రం లీకైనట్లు అంతకు రెండు రోజుల ముందు పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టగా ప్రవీణ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితురాలు రేణుక కోసం ఏఈ ప్రశ్నపత్రం లీక్‌ చేసినట్లు అంగీకరించాడు. కానీ దర్యాప్తులో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ సహా మిగతా పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా లీక్‌ అయినట్లు వెల్లడయింది. ఇందులో దాదాపు 2.85 లక్షలమంది రాసిన గ్రూప్‌-1 పరీక్ష ప్రధానమైంది. దీనిపైనే అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాను రేణుకకు, అమె తమ్ముడి కోసం ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం మాత్రమే ఇచ్చినట్లు ప్రవీణ్‌ తొలుత చెప్పాడు. కానీ అది వాస్తవం కాదని, ప్రవీణ్‌ స్వయంగా మరి కొందరికి కూడా ప్రశ్నపత్రాలు ఇచ్చినట్లు, వాటిలో గ్రూప్‌-1 ప్రశ్నపత్రం కూడా ఉన్నట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. ప్రవీణ్‌ ద్వారా ఇలా ప్రశ్నపత్రాలు పొందిన వారిని ఇప్పటికే గుర్తించి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు డబ్బు అవసరం ఉందని, ఇందుకోసం ప్రశ్నపత్రాలు ముందుగానే అందిస్తానని ప్రవీణ్‌ గత కొన్ని నెలలుగా పలువురితో చెప్పినట్లు గుర్తించారు. తనను నమ్మి, డబ్బు చెల్లించేందుకు సిద్ధమైన కొందరికి మాత్రం ప్రశ్నపత్రం ముందుగానే చేరవేసినట్లు, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించినట్లు సమాచారం. డబ్బు చెల్లించి ప్రశ్నపత్రం కొన్న తర్వాత సదరు వ్యక్తి దాన్ని మరొకరికి అమ్ముకొని సొమ్ము చేసుకునే అవకాశం కూడా ఉంది. అందుకే గొలుసుకట్టు మాదిరిగా జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగస్వాములైన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

తప్పుదోవ పట్టించే ప్రయత్నం

ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రేణుక, రాజశేఖర్‌రెడ్డి తదితరులు తమను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. తొలుత తన తమ్ముడి కోసం ఏఈ ప్రశ్నపత్రం తెప్పించుకున్నట్లు రేణుక చెప్పింది. కానీ  దర్యాప్తులో మాత్రం మిగతా ప్రశ్నపత్రాలు కూడా లీక్‌ అయినట్లు తేలింది. ఇక ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిలను సిట్‌ అధికారులు ఎంతగా ప్రశ్నించినా తాము ఫిబ్రవరిలోనే ప్రశ్నపత్రాలు చోరీ చేసినట్లు చెబుతున్నారు. అంటే అంతకు ముందు జరిగిన గ్రూప్‌-1 వంటి పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ చేయలేదని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ సిట్‌ దర్యాప్తులో అక్టోబరులోనే రాజశేఖర్‌రెడ్డి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ కంప్యూటర్లను వాడినట్లు తేలింది. అంటే అప్పటి నుంచి కొట్టేస్తున్నారని నిర్ధారణ అయినట్లే. అందుకే అప్పుడు జరిగిన గ్రూప్‌-1 సహా మొత్తం నాలుగు పరీక్షలను రద్దు చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెబుతున్నారని, ముఖ్యంగా దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ప్రయత్నిస్తున్నారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఏఈ ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేశామని ఒప్పుకోవడం ద్వారా దర్యాప్తును దానికి మాత్రమే పరిమితం చేయాలని, అంతకు ముందు జరిగిన గ్రూప్‌-1 వంటి పరీక్షల వరకూ వెళ్లకుండా చూడాలని ఎత్తుగడ వేశారని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని