కొలువులే లక్ష్యం.. పండగలకు దూరం

ఏడాది కాలంగా వారికి పండగలూపబ్బాలూ లేవు.. ఊరిలో అడుగుపెట్టింది, తల్లిదండ్రులను కళ్లారా చూసి పలకరించిందీ లేదు.

Published : 23 Mar 2023 05:35 IST

ఏడాదికి ఒకసారి కూడా ఊరికి వెళ్లకుండా పరీక్షలకు సన్నద్ధం
బంధువులు శుభకార్యాలకు పిలవడమూ మానుకున్నారు
ఈ పరిస్థితుల్లో ప్రశ్నపత్రాల లీకేజీతో హతాశులైన నిరుద్యోగ అభ్యర్థులు

ఈనాడు, హైదరాబాద్‌: ఏడాది కాలంగా వారికి పండగలూపబ్బాలూ లేవు.. ఊరిలో అడుగుపెట్టింది, తల్లిదండ్రులను కళ్లారా చూసి పలకరించిందీ లేదు. సర్కారు కొలువు కొట్టాకే సొంత గడ్డపై కాలు మోపాలన్న బలీయమైన ఆకాంక్ష వారిని కఠోర దీక్ష వైపు నడిపించింది. అయితే, ఈ సారైనా లక్ష్యం నెరవేరుతుందని ఆశపడి తీవ్రంగా శ్రమిస్తున్న వేల మంది నిరుద్యోగ యువతకు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అశనిపాతంగా మారింది. వారి ఆశలు అడియాసలయ్యాయి.

ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా వేల మంది నిరుద్యోగ యువత హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌, గాంధీనగర్‌, చిక్కడపల్లి తదితర ప్రాంతాలను చిరునామాగా మార్చుకుని శ్రమిస్తున్నారు. ఇప్పుడు వారిలో ఎవరిని కదిలించినా.. తమ ప్రణాళికలు తారుమారై పోయాయని, లక్ష్యం అందినట్లే అంది మరింత దూరంగా పోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉగాదికి కూడా ఊరికి వెళ్లలేకపోయామంటున్నారు. హైదరాబాద్‌ నగర కేంద్ర గ్రంథాలయంలో పలువురిని ‘ఈనాడు’ పలకరించినప్పుడు తాము సొంతూరిని చూసి ఏడాది దాటిందని చెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో కొలువుల లక్ష్యం ఎప్పటికి నెరవేరుతుందోనన్న ఆందోళనతో అభ్యర్థులు ఉన్నారు. తల్లిదండ్రుల కష్టంపై ఎన్నాళ్లు ఆధారపడి బతకాలి..? రూ.5 భోజనం ఇంకెన్నాళ్లు తినాలి? అని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నిరుద్యోగులు డీలా పడటంతో పుస్తకాల విక్రయ వ్యాపారం గత వారం రోజులుగా 40 శాతం తగ్గిందని అశోక్‌నగర్‌లోని పుస్తక విక్రయ వ్యాపారి శ్రీనివాస్‌ తెలిపారు.

సెలవుల కష్టాలు...

ఇప్పటికే కొలువులున్న వారి కష్టాలు మరోరకం. కొద్ది నెలలు సెలవు పెట్టి పెద్ద ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ‘‘మొత్తానికి జూన్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పూర్తయితే మళ్లీ ఉద్యోగంలో చేరాలని అనుకున్నా. ఇప్పుడు లీకేజీ కారణంగా వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. సెలవు పొడిగించుకునేందుకు ఎన్ని పాట్లు పడాలో’’ అని ఓ శిక్షణ సంస్థలో సన్నద్ధమవుతున్న ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వాపోయారు. ‘మెయిన్స్‌ కోసం ఉద్యోగానికి సెలవు పెట్టా. లీకేజీ నేపథ్యంలో మరిన్ని రోజులు సెలవులు కొనసాగించలేను. త్వరలో జాబ్‌లో చేరతాను’ అని నిజామాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఒకరు చెప్పారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత సాధించిన వారిలో కనీసం 10 వేల మంది వరకు ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్‌ కొలువుల్లో ఉన్న వారని అంచనా. గత ఆరు నుంచి 12 నెలలుగా వేతనం లేదని.. ఇంకోవైపు కొలువు దక్కుతుందన్న ఆశా నెరవేరేలా లేదని చాలా మంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఈ సారి మరింత పోటీ తప్పదా?

గత అక్టోబరులో జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు 3.80 లక్షల మంది దరఖాస్తు చేసినా హాజరైంది 2.85 లక్షల మందే.  వేల మంది సివిల్స్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసినా సివిల్స్‌ పరీక్షలు అసలు లక్ష్యం కాబట్టి గ్రూప్‌-1 రాయలేదు. ఈ సారి మే 28న సివిల్స్‌ ప్రిలిమినరీ పూర్తవుతుంది కాబట్టి వారు కూడా జూన్‌లో జరిగే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాస్తారు. ఇలా పలు కారణాలతో ఈ సారి పోటీ మరింత గట్టిగానే ఉంటుందని కొందరు అభ్యర్థులు అంచనా వేస్తున్నారు.


రూ.6 లక్షల అప్పు అయింది

శంకర్‌, నిజామాబాద్‌

2014లో ఓయూ ప్రాంగణంలో పీజీ పూర్తి చేశా. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నా. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. నేను హైదరాబాద్‌లో ఉంటూ సన్నద్ధం అవుతుండటంతో 2015 నుంచి ఇప్పటి వరకు రూ.6 లక్షల అప్పు అయింది. లక్ష్యం సాధించేవరకు ఊరికి వెళ్లను. చెప్పినా రానని బంధువులు శుభకార్యాలకు పిలవడమే మానేశారు. చాలా మంది నిరుద్యోగుల పరిస్థితి ఇదే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు