టీబీ మందులతో కంటికి ముప్పు

క్షయ.. వయస్సు, లింగ, పేద, ధనిక సంబంధం లేకుండా దేశంలో ఏటా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తోంది. ప్రపంచంలోకెల్లా భారత్‌పై క్షయ భారం అధికంగా ఉంది.

Updated : 23 Mar 2023 04:17 IST

దీర్ఘకాలంగా ఇతాంబ్యుటోల్‌ వాడితే చూపు కోల్పోయే ప్రమాదం
1-3 శాతం మందిలో దుష్ప్రభావం
ఏఐజీ అధ్యయనంలో కొత్త కోణం ఆవిష్కరణ
24న ప్రపంచ క్షయ నివారణ దినం

క్షయ.. వయస్సు, లింగ, పేద, ధనిక సంబంధం లేకుండా దేశంలో ఏటా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తోంది. ప్రపంచంలోకెల్లా భారత్‌పై క్షయ భారం అధికంగా ఉంది. రాష్ట్రంలో ఏటా 70వేలకు పైగా కొత్త టీబీ కేసులు నమోదవుతుండగా.. సుమారు 2 వేల మంది మృత్యువాతపడుతున్నారు. అయితే.. తాజాగా ఏఐజీ హాస్పిటల్స్‌ (గచ్చిబౌలి) వైద్యులు నిర్వహించిన అధ్యయనంలో.. టీబీకి వాడే మందుల వల్ల కంటికి ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయని తేలింది. ముఖ్యంగా ‘ఇతాంబ్యుటోల్‌’ ఔషధాన్ని దీర్ఘకాలం వినియోగిస్తే.. చూపు కోల్పోయే ప్రమాదం అధికమని నిర్ధారణ అయింది. ఏఐజీకి చెందిన ప్రముఖ శ్వాసకోశ నిపుణులు డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్లా, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆఫ్తల్మిక్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ స్వప్నాలీ సభాపండిట్‌ తదితరులు నిర్వహించిన తాజా అధ్యయన పత్రం ఇటీవలే ‘ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఆఫ్తల్మాలజీ’లో ప్రచురితమైంది. క్షయ వ్యాధి చికిత్సలో కొత్త కోణాలను ఈ అధ్యయన పత్రంలో ఆవిష్కరించారు. ఇతాంబ్యుటోల్‌ ఔషధ చికిత్స వల్ల కలిగే నష్టాలపై ప్రపంచంలోనే ఇది తాజా అధ్యయనమని వైద్యులు పేర్కొన్నారు. ఈ అంశంపై ఇప్పటివరకూ 639 అధ్యయనాలు వెలువడ్డాయి. ఇందులో 62 అధ్యయనాలను ఎంపిక చేసి, క్షుణ్నంగా పరిశోధించారు. మళ్లీ అందులోంచి 12 పూర్తి స్థాయి వ్యాసాలను ఎంపిక చేసి..ప్రస్తుతం రోగులకు అందిస్తున్న చికిత్సను విశ్లేషించి తుది పరిశోధన పత్రాన్ని రూపొందించారు. ఈనెల 24న ‘ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం’ సందర్భంగా ప్రత్యేక కథనం.

కనుగుడ్డు నుంచి మెదడుకు వెళ్లే నరంపై..

క్షయను గుర్తించగానే.. తొలి రెండు నెలల్లో ఐసోనియాజిడ్‌, రిఫామ్‌పిసిన్‌, పైరాజినమైడ్‌, ఇతాంబ్యుటోల్‌.. అనే నాలుగు ఔషధాలిస్తారు. ఆ తర్వాత వ్యాధి తీవ్రత, రోగి లక్షణాలను బట్టి 6-9-12 నెలల వరకూ కూడా రెండో దశలో కేవలం ఐసోనియాజిడ్‌, రిఫామ్‌పిసిన్‌.. ఈ రెండు ఔషధాలను మాత్రమే గతంలో వైద్యులు సూచించేవారు. సుమారు 10 శాతం మందిలో ఆ మందులు పనిచేయడం లేదని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండో దశలోనూ ఇతాంబ్యుటోల్‌ను కూడా ఇవ్వాలని పేర్కొంది. దీంతో భారత్‌లో 2016 నుంచి క్షయ చికిత్సలో దానిని కూడా రెండోదశలో చేర్చారు. దాంతో క్షయ చికిత్సలో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. అయితే ఇక్కడే కొత్త సమస్య కూడా మొదలైనట్లు పరిశోధకులు గుర్తించారు. ఇతాంబ్యుటోల్‌ను దీర్ఘకాలం వాడడం వల్ల కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనాలోని ‘ఆప్టిక్‌ నర్వ్‌’ దెబ్బతింటోంది. కనుగుడ్డు నుంచి మెదడుకు వెళ్లే ప్రధాన నరం ఇది. మనం ఏ దృశ్యం చూసినా.. దాన్ని గుర్తుపట్టి, ఫలానా అనే సంకేతమిచ్చేందుకు దోహదపడేది ఈ నరమే. ఈ మందును వాడుతున్న వారిలో సుమారు 1-3 శాతం మందిలో ఈ సమస్య తలెత్తే ముప్పు పొంచి ఉందని పరిశోధకులు తేల్చారు.

కంటి నరం దెబ్బతిన్నప్పుడు లక్షణాలు

కళ్లు మసక మసకగా కనిపిస్తాయి.

వస్తువుల అంచులను (షార్ప్‌ ఎడ్జెస్‌)    గుర్తించడంలో వైఫల్యం

రంగులను సరిగా గుర్తించలేరు.

ఏంచేయాలి?

టీబీ మందులు వాడుతున్న వారిలో ఇలాంటి లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

వారికి గనుక ఇతాంబ్యుటోల్‌ను ఇస్తుంటే.. వెంటనే నిలిపివేసి, ప్రత్యామ్నాయ ఔషధాన్ని ఇవ్వాలి.

సరైన సమయంలో గుర్తించి, ఇతాంబ్యుటోల్‌ను నిలిపివేయగలిగితే.. 70 శాతం మందిలో సమస్య తగ్గిపోయి, చూపు సాధారణ స్థితికి చేరుకుంటుంది. 30 శాతం మందిలో ఇతర చికిత్సలు అవసరమవుతాయి. కొన్నిసార్లు చూపు తిరిగి రాకపోయే ప్రమాదమూ ఉంది.

కంటి నరం దెబ్బతిన్నదా? లేదా? అని గుర్తించడానికి ముఖ్యంగా విజువల్‌ ఫీల్డ్‌ పరీక్ష చేయాల్సి ఉంటుంది.

వైద్యులు కూడా టీబీ చికిత్స చేసేప్పుడు కంటి చూపు   విషయంలోనూ దృష్టిపెట్టాల్సిన అవసరముంది. టీబీ మందులు వాడుతున్నప్పుడు కనీసం ప్రతి మూడు నెలలకోసారి కంటి పరీక్షలు చేయించాలి.

ముప్పు ఎవరిలో ఎక్కువ?

సాధారణంగా ఈ మందు మొదలుపెట్టిన తొలి 2-3 నెలల్లో సమస్యలు వచ్చే అవకాశాలెక్కువ. ఈ సమస్య చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఎవరిలోనైనా రావొచ్చు. కొందరిలో మాత్రం ముప్పు తీవ్రత     ఎక్కువగా ఉంటుంది.  

65 ఏళ్లు దాటిన వారు

కిడ్నీ వైఫల్య బాధితులు

నియంత్రణ లేని అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు

దీర్ఘకాలంగా ధూమపానం చేస్తున్నవారు

పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నవారు

హెచ్‌ఐవీ, హెపటైటిస్‌-బి, సి వంటి  దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు

ఇలాంటి వారు ఇతాంబ్యుటోల్‌ ఔషధాన్ని ప్రారంభించడానికి ముందే.. టీబీకి దానిని తీసుకోవచ్చా? అని అడిగి మొదలుపెట్టడం శ్రేయస్కరం.


టీబీకి ప్రభుత్వ వైద్యంలో ఉచిత చికిత్స

డాక్టర్‌ ఆడెపు రాజేశం, సంయుక్త సంచాలకులు, జాతీయ ఆరోగ్య మిషన్‌ - క్షయ నిర్మూలన పథకం

రాష్ట్రంలో 2022లో అత్యధికంగా క్షయ కేసులు నమోదైన జిల్లాల్లో హైదరాబాద్‌ (12,600) ముందుంది. ఆ తర్వాత మేడ్చల్‌ మల్కాజిగిరి (5,699), రంగారెడ్డి (5,038), నల్గొండ (2,970), ఖమ్మం (2,849), సంగారెడ్డి (2,645), సూర్యాపేట (2,268), సిద్దిపేట(2,156), భద్రాద్రి కొత్తగూడెం (2,131) ఉన్నాయి. ‘నిక్షయ్‌ పోషణ్‌ యోజన’ కింద క్షయ వ్యాధిగ్రస్థులైన చిన్నారులకు పోషకాహారం అందించడానికి నెలకు రూ.500 చొప్పున, గిరిజనులకు రూ.500కు అదనంగా ఒక్కసారి మాత్రం రూ.750 చొప్పున పారితోషికం అందిస్తున్నాం. చికిత్సను మధ్యలో మానేసి వ్యాధి తిరగబెట్టిన పిల్లలకు రవాణా భత్యం కింద అదనంగా రూ.1,200 అందజేస్తున్నాం. వ్యాధిగ్రస్థుల సమాచారాన్ని అందించినవారికి రూ.500, సాధారణ క్షయ రోగికి ఆరు నెలలపాటు పూర్తి చికిత్స అందించినందుకు వైద్యునికి రూ.1000, వ్యాధి తిరగబెట్టిన రోగికి పరిపూర్ణ చికిత్స ఇచ్చినందుకు వైద్యునికి రూ.5 వేల చొప్పున పారితోషికం అందిస్తూ.. క్షయ నిర్మూలనలో భాగస్థులయ్యేలా ప్రోత్సహిస్తున్నాం. క్షయ వ్యాధికి ప్రభుత్వ వైద్యంలో రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్స పూర్తి ఉచితంగా అందజేస్తున్నాం.

ఈనాడు- హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు