మిగులు జలాల వినియోగాన్నీ లెక్కలోకి తీసుకోవాలి!

రిజర్వాయర్లన్నీ నిండి వరద లేదా మిగులు జలాలను మళ్లించి వినియోగించుకొంటే దాన్ని వాడకం కింద తీసుకోవాల్సిందేనని బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌లో తెలంగాణ తరఫున సాక్షిగా.

Updated : 23 Mar 2023 05:36 IST

బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట తెలంగాణ సాక్షి

ఈనాడు హైదరాబాద్‌: రిజర్వాయర్లన్నీ నిండి వరద లేదా మిగులు జలాలను మళ్లించి వినియోగించుకొంటే దాన్ని వాడకం కింద తీసుకోవాల్సిందేనని బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌లో తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్‌ చేతన్‌పండిట్‌ స్పష్టంచేశారు. కృష్ణాబోర్డు దీనికి భిన్నంగా నిర్ణయం తీసుకొన్నా అది ఆమోదయోగ్యం కాదని... ఇలాంటి అంశాలపై నిర్ణయం తీసుకొనే అధికారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేదని, ట్రైబ్యునల్‌ తీసుకునేదే తుది నిర్ణయమని అన్నారు. కృష్ణా బేసిన్‌లో ఆపరేషన్‌ ప్రోటోకాల్‌పై తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న పండిట్‌ను ఆంధ్రప్రదేశ్‌  సీనియర్‌ న్యాయవాది విచారించారు. తర్వాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటిని తిరిగి కేటాయిస్తూ తెలంగాణ జారీచేసిన జీవోపై ఆంధ్రప్రదేశ్‌ దాఖలుచేసిన మధ్యంతర దరఖాస్తుపై విచారణ జరగనుంది. మిగులు జలాలను వినియోగం కింద తీసుకోవడంపై కృష్ణా బోర్డు ఏ పద్ధతిని అనుసరిస్తుందో తనకు తెలియదని, రిజర్వాయర్లు పొంగిపొర్లినప్పుడు మళ్లించి వాడుకొనే నీటిని వినియోగం కింద పరిగణనలోకి తీసుకోకపోతే వారు చేస్తున్న దాంతో తాను అంగీకరించనని పండిట్‌ స్పష్టంచేశారు. తెలంగాణ ప్రభుత్వం దీనికి అంగీకరించిందో, అంగీకరించలేదో కూడా తనకు తెలియదని, ఇలాంటి అంశాల్లో కేఆర్‌ఎంబీ తుది అథారిటీ కాదని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ న్యాయవాది ఉమాపతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణాబోర్డు ఏర్పాటైందని, ట్రైబ్యునల్‌ అవార్డులను అమలు చేసే బాధ్యత బోర్డుకు ఉంటుందని, దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారని అన్నారు. కృష్ణాబోర్డు పనిని విశ్లేషించడం తన పరిధిలోకి రాదని, కొన్ని అంశాల్లో కృష్ణాబోర్డుతో తెలంగాణ ప్రభుత్వం ఏకీభవించడం లేదని మాత్రం తనకు తెలుసని పండిట్‌ సమాధానమిచ్చారు. మిగులు నీటిని వాడుకొంటే వినియోగం కింద తీసుకోరాదన్న వాదనను పరిగణనలోకి తీసుకోవద్దని ట్రైబ్యునల్‌కు విజ్ఞప్తిచేశారు. మొదటి కృష్ణా ట్రైబ్యునల్‌ 75 శాతం నీటి లభ్యత కింద చేసిన కేటాయింపులను రెండో ట్రైబ్యునల్‌ కూడా కొనసాగించిందని, ఇందులో పక్క బేసిన్‌లోని ప్రాజెక్టులు కూడా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీలు మొత్తం రాష్ట్రానికి తప్ప ప్రాజెక్టుల వారీగా కాదని తెలంగాణ సాక్షి పేర్కొన్నారు. ప్రాజెక్టుల వారీ కేటాయింపులను ట్రైబ్యునల్‌ చేయాల్సి ఉందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు