ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రణాళిక

పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈమేరకు 130 పురపాలక సంఘాల్లో ‘సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’కు ప్రణాళిక రూపొందించింది.

Published : 23 Mar 2023 04:07 IST

తొమ్మిది క్లస్టర్లుగా 130 పురపాలికలు

ఈనాడు, హైదరాబాద్‌: పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈమేరకు 130 పురపాలక సంఘాల్లో ‘సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’కు ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో 142 పురపాలక సంఘాలుండగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని వాటిని మినహాయించి మిగిలిన అన్నింటిలోనూ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజూ 12,125 టన్నుల ఘన వ్యర్థాలు వెలువడుతుండగా వాటిలో 9,679 టన్నుల మేర మాత్రమే నిర్వహణ చేస్తున్నారు. మిగిలిన 2,446 టన్నుల వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. రోజువారీ వ్యర్థాల్లో అధిక శాతం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచే వస్తుండగా.. వివిధ ప్రాంతాల్లో వాటిని నిర్వహణ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్‌, ప్లాస్టిక్‌ తదితర వ్యర్థాలను వేరు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి పాదచారుల మార్గాలకు వాడే బ్లాక్స్‌ తయారు చేస్తున్నారు. మరికొన్నింటిని పునర్వినియోగించే విషయమై కసరత్తు చేస్తున్నారు. జనాభా కూడా పెరుగుతున్న దృష్ట్యా ముందస్తు వ్యూహాన్ని రూపొందించి ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఘన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికలో భాగంగా 130 పురపాలికలను ప్రాంతాలవారీగా 9 క్లస్టర్లుగా విభజించారు. ప్రతి క్లస్టర్‌లో 10 నుంచి 20 వరకు పురపాలికలను ప్రతిపాదించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, జనగామ క్లస్టర్‌లో 16 పురపాలికలను చేర్చారు. రంగారెడ్డి పరిధిలో 14, నల్గొండ, సూర్యాపేట క్లస్టర్‌లో 11, ఖమ్మం, వరంగల్‌ గ్రామీణం, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్‌ పరిధిలో 15, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ-గద్వాల్‌, నారాయణపేట పరిధిలో 19, కరీంనగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల పరిధిలో 11, కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌ పరిధిలో 10, అదిలాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కుమురంభీం, జయశంకర్‌ భూపాలపల్లిలో 14, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌ క్లస్టర్‌ పరిధిలో 20 పురపాలికలను చేర్చారు. ఆయా క్లస్టర్ల పరిధిలోని పురపాలికల నుంచి వచ్చే ఘన వ్యర్థాలను ఒక చోటుకు చేర్చి లేదా వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తారా? అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రాష్ట్ర మున్సిపల్‌ వ్యవహారాల శాఖ గుత్తేదారులను ఆహ్వానించింది. ‘డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌ఓటీ)’ ప్రాతిపదికన ఆసక్తి చూపేవారు ప్రతిపాదనలు దాఖలు చేయాలని ఆహ్వానించడంతో పలువురు ముందుకొచ్చారు. వీరు దాఖలుచేసిన సాంకేతిక బిడ్స్‌ను అధికారులు అధ్యయనం చేస్తున్నారు. త్వరలో ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని