17 ఏళ్లుగా ఒప్పంద విధులే!

రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. నెలనెలా వేతనాలు అందక అల్లాడుతున్నారు.

Published : 23 Mar 2023 05:17 IST

క్రమబద్ధీకరణ జాబితాలో దక్కని చోటు  
ఆందోళనలో ఉపాధి హామీ ఉద్యోగులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. నెలనెలా వేతనాలు అందక అల్లాడుతున్నారు. మరోవైపు 17 సంవత్సరాలుగా ఒప్పంద కేటగిరిలో ఉన్నా ప్రభుత్వం ప్రకటించిన క్రమబద్ధీకరణ జాబితాలో తమకు చోటు దక్కకపోవడంపై వారు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి హామీ పథకం నిర్వహణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో 12 వేల మందిని ఒప్పంద ప్రాతిపదికన తీసుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో 3,874 మంది తెలంగాణలో మిగిలారు. వీరంతా సహాయ కార్యక్రమ అధికారి(ఏపీవో), ఇంజినీరింగ్‌ సలహాదారు, టెక్నికల్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, ప్లాంటేషన్‌ సూపర్‌వైజర్‌ కేటగిరీల్లో పని చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, సీసీ రోడ్లు, రైతు వేదికలు, కల్లాలను నిర్మిస్తున్నారు. ఈ పనుల్లో పాల్గొనే కూలీలకు జాబ్‌కార్డుల జారీ, హాజరు పట్టికల నిర్వహణ, పనిదినాల నమోదు, సామాజిక తనిఖీలకు సమాచారం అందివ్వడం తదితర పనులన్నీ వీరే నిర్వహిస్తున్నారు. అయితే... ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ జాబితాలో వీరికి చోటుదక్కలేదు. దీనిపై తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.  తమను క్రమబద్ధీ కరించాలని లేదంటే సెర్ప్‌ ఉద్యోగుల తరహాలోనే పేస్కేల్‌ వర్తింపజేయాలని వారు విన్నవిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని