ట్రామాకేర్‌ విధానం.. తమిళనాడులో ఉత్తమం

రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు సత్వరం చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడే ‘ట్రామాకేర్‌ వ్యవస్థ’ తమిళనాడులో ఆదర్శంగా పనిచేస్తోంది.

Published : 23 Mar 2023 05:17 IST

అంబులెన్సులు చేరుకునే వేగం పెరిగింది... మరణాలు తగ్గాయి
48 గంటల పాటు ఉచితంగా వైద్యసేవలు
తెలంగాణలో కార్యాచరణ కోసం అధ్యయనం

ఈనాడు, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు సత్వరం చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడే ‘ట్రామాకేర్‌ వ్యవస్థ’ తమిళనాడులో ఆదర్శంగా పనిచేస్తోంది. దేశంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎక్కువమంది చనిపోతున్న ఆ రాష్ట్రంలో అయిదేళ్ల క్రితం ప్రారంభించిన వ్యవస్థ సత్ఫలితాలిస్తోంది. రైట్‌ పేషెంట్‌, రైట్‌ సెంటర్‌, రైట్‌ టైమ్‌ అనే లక్ష్యంతో ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రమాదాల సంఖ్య 2.27 శాతం పెరిగినా మరణాల్లో 1.35 శాతం తగ్గించగలిగినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రమాద స్థలానికి అంబులెన్స్‌ చేరుకునే సమయం గతంలో 18.09 నిమిషాలు కాగా తాజాగా 13.51 నిమిషాలకు తగ్గించగలిగినట్లు పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే (గోల్డెన్‌ అవర్‌లో) అత్యవసర చికిత్స అందిస్తే 54 శాతం నుంచి 90 శాతం మంది ప్రాణాలను కాపాడవచ్చునని నిపుణులు చెప్తున్నారు.

ఏం చేశారంటే...

‘ప్రాణాలను కాపాడటమే ధ్యేయం’ నినాదంతో తమిళనాడులో ప్రత్యేక ట్రామాకేర్‌ వ్యవస్థకు నాంది పలికారు. ఈ విభాగానికి ప్రత్యేకంగా కమిషనర్‌ను నియమించారు. ప్రమాదం జరిగినపుడు సమాచారం తీసుకోవడం, తీవ్రతను అంచనావేయడం, స్పందించడం, చేరుకోవడం, అత్యవసరవైద్యం అందించడం, ప్రధాన ఆసుపత్రుల్లో వైద్యసేవలు కొనసాగించడం అనే లక్ష్యాలతో నడుస్తోంది. ఎమర్జెనీ రెస్పాన్స్‌ సెంటర్‌లో నాలుగు షిఫ్టులుగా సిబ్బంది 24 గంటలూ సేవలు అందిస్తున్నారు. అత్యంత వేగంగా ప్రమాదస్థలికి అంబులెన్స్‌లు చేరుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అత్యాధునిక వైద్య పరికరాలు, వసతులు ఏర్పాటు చేశారు. వాటిలోనే ప్రాథమిక వైద్యం అందించడమే కాకుండా సమీపంలోని ఆసుపత్రికి ముందస్తు సమాచారం ఇస్తారు. అక్కడ 1,353 అంబులెన్స్‌లు, 94 ట్రామాకేర్‌ సెంటర్లు ఉన్నాయి. న్యూరో సర్జరీ, ప్లాస్టిక్‌, రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ, రేడియాలజీ, ఆర్థోపెడిక్‌, జనరల్‌ సర్జరీ, అనస్థీషియా, క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌ వంటి స్పెషలిస్ట్‌ విభాగాల్లో ప్రత్యేక వైద్యసేవలు అందించేలా  ఏర్పాట్లు ఉన్నాయి.

లక్ష రూపాయల వరకు ఉచిత వైద్యం

ట్రామామెషిన్‌ ద్వారా తీవ్రత అంచనాతోపాటు సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, మొబైల్‌ ఎక్స్‌రే, క్యాత్‌ల్యాబ్‌ సహా అత్యాధునిక వైద్య సదుపాయాలు ట్రామాకేర్‌ సెంటర్లలో ఉన్నాయి. ప్రత్యేకంగా స్పెషలిస్ట్‌ల పోస్టులను ఏర్పాటు చేశారు. 22 వైద్య కళాశాలల్లో అత్యవసర వైద్యంలో ప్రత్యేకంగా 84 పీజీ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. వివిధ విభాగాల్లో 25 వేలమందికి పైగా అత్యవసర చికిత్సపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు కల్పించారు. క్షతగాత్రులకు 48 గంటల పాటు ఉచితంగా అత్యాధునిక వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేశారు. గాయపడినవారు ఎవరైనా ఒక్కొక్కరికి లక్ష రూపాయల దాకా ఎలాంటి రుసుం   తీసుకోకుండా వైద్యం అందిస్తారు. తమిళనాడు ప్రభుత్వం ఏటా దీనికి రూ.150 కోట్లను కేటాయిస్తోంది.

తెలంగాణలో 2021లో 7,557 మంది మృతి

తెలంగాణలో 2021లో రోడ్డు ప్రమాదాల్లో 7,557 మంది చనిపోయినట్లు జాతీయ నేర గణాంకాల నివేదిక-2021లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆ ఏడాది 21,315 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 20,107 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో మూడో వంతుకుపైగా చనిపోయారు. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినవారిలో 11.6 శాతం మంది తెలంగాణలో జరిగిన ప్రమాదాల్లోని వారే.

రాష్ట్రంలో ట్రామాకేర్‌ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి

ప్రమాదాలకు గురై తీవ్రంగా లేదా స్వల్పంగా గాయపడినవారికి సత్వరం వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రంలో ట్రామాకేర్‌ సెంటర్ల ఏర్పాటుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ నేతృత్వంలో వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గంగాధర్‌, రమేశ్‌రెడ్డి, అజయ్‌కుమార్‌, చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర అధికారులు తమిళనాడులో అమలవుతున్న ట్రామాకేర్‌ విధానంపై అధ్యయనం చేశారు. రాష్ట్రంలోనూ ప్రత్యేక ట్రామాకేర్‌ విధానం రూపకల్పన దిశగా ప్రత్యేక కార్యాచరణకు రంగం సిద్ధమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని