ఆర్టీసీ బస్సుల్లో ‘డైనమిక్‌’ బాదుడు

ఆర్టీసీ బస్సులో ఇకపై కిటికీ పక్కన, ముందు వరుసలో సీటు కావాలంటే అదనంగా కొంత రుసుము చెల్లించాల్సిందే. సీట్లు అయిపోయేకొద్దీ మిగతా సీట్లకు ఛార్జీలు పెరగనున్నాయి.

Published : 24 Mar 2023 05:35 IST

కిటికీ, ముందు వరుస సీట్లకు   వేర్వేరు ధరలు
రద్దీ రోజుల్లో 25% అదనపు ఛార్జీలు
డిమాండ్‌ లేనప్పుడు 20-30% తక్కువ  
27 నుంచి బెంగళూరు మార్గంలో  ప్రయోగాత్మకంగా అమలు

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సులో ఇకపై కిటికీ పక్కన, ముందు వరుసలో సీటు కావాలంటే అదనంగా కొంత రుసుము చెల్లించాల్సిందే. సీట్లు అయిపోయేకొద్దీ మిగతా సీట్లకు ఛార్జీలు పెరగనున్నాయి. విమానాలు, హోటళ్లు, ప్రైవేటు బస్‌ ఆపరేటర్లు అమలు చేస్తున్న డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానాన్ని టీఎస్‌ఆర్టీసీలో ఆచరించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. తొలుత ఈనెల 27 నుంచి బెంగళూరు మార్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు బస్‌భవన్‌లో గురువారం టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ సజ్జనార్‌లు డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానాన్ని ప్రకటించారు. డిమాండ్‌ ఉన్నప్పుడు టికెట్‌ ధర 25% వరకు ఎక్కువగా ఉంటుందని, లేదంటే 20-30% వరకు తక్కువ ధరకే టికెట్లు దొరుకుతాయన్నారు.

త్వరలో 3,200 బస్సుల్లోనూ..

డైనమిక్‌ ఛార్జీల బాదుడు ప్రస్తుతం బెంగళూరు మార్గానికే పరిమితమైనా త్వరలో రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌ నుంచి ఏపీలోని విజయవాడ, తిరుపతి వంటి నగరాలకు, ఇతర రాష్ట్రాలకు నడిచే టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో అమలుకానుంది. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్‌, ఎండీ తెలిపారు. ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్‌ ఉన్న 3,200 సర్వీసుల్లోనూ అమలు చేయనున్నారు. అంటే శని, ఆది, సోమవారాలు, వేసవి సెలవులు, పండగ రోజుల్లో ప్రయాణికులపై అధిక ఛార్జీల భారం పడనుంది.

పైలట్‌ ప్రాజెక్టుగా అదే రూట్‌లో ఎందుకంటే..

హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం నుంచి బెంగళూరుకు నిత్యం 46 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఆదివారం రాత్రి ఇక్కడ్నుంచి బెంగళూరుకు వెళతారు. ఈ మార్గంలో రైళ్ల సంఖ్య తక్కువ. పైగా ప్రయాణ సమయం ఎక్కువ. దీంతో ఎక్కువమంది బస్సులకు ప్రాధాన్యమిస్తున్నారు. బస్సుల్లో సీట్లు దొరకవు. దాంతో కేఎస్‌ఆర్టీసీ, ప్రైవేటు ఆపరేటర్లు ఛార్జీలు పెంచుతున్నారు. అయితే... మంగళ, బుధ, గురువారాల్లో ప్రయాణాలు తక్కువ. ఆ రోజుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ కూడా డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానం అమలుకు నిర్ణయించింది. ‘బస్సులు బయల్దేరే గంట ముందువరకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. డైనమిక్‌తో గరిష్ఠభారం 25 శాతమే. వికలాంగులు, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులపై దీని ప్రభావం ఉండదు. టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ ‌్ర్ర్ర.్మ(౯్మ‘్న-ఃi-’.i-లో సీట్లు బుక్‌ చేసుకోవాలి’ అని ఎండీ సజ్జనార్‌ కోరారు. ‘2002లో 62% ఉన్న ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 2023నాటికి 68 శాతానికి పెరిగింది. ప్రైవేటుతో పోటీని తట్టుకునేందుకే ఈ విధానం అమలుకు నిర్ణయించాం’ అని బాజిరెడ్డి   గోవర్దన్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని