సంక్షిప్త వార్తలు

మహిళలను అగౌరవపరచేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మకు భాజపా మహిళా మోర్చా రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేశారు.

Updated : 24 Mar 2023 05:43 IST

మహిళలను అగౌరవపరచిన నేతలపై చర్యలు తీసుకోవాలి

ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌కు మహిళా మోర్చా వినతి

ఈనాడు, దిల్లీ: మహిళలను అగౌరవపరచేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మకు భాజపా మహిళా మోర్చా రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేశారు. గురువారమిక్కడి ఎన్‌సీడబ్ల్యూ కార్యాలయంలో రేఖా శర్మకు మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి, ప్రధాన కార్యదర్శి కల్యాణం గీతారాణి, ఉపాధ్యక్షురాలు మాలతీ లత వినతిపత్రం సమర్పించారు. ఓ మహిళా ఉద్యోగిపై అసభ్య పదజాలం వినియోగించిన మంత్రి ఎర్రబెల్లిని, భాజపా రాష్ట్ర అధ్యక్షుడి సతీమణి, పార్టీ మహిళా కార్యకర్తలపై వ్యాఖ్యలు చేసిన నకిరేకల్‌ ఎమ్మెల్యే లింగయ్యను పిలిచి విచారించాలని కోరారు.


వడగళ్లు పడినా.. పెరిగిన పంట విస్తీర్ణం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వడగళ్ల వర్షాలు కురిసినా ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటల విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయ శాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గతవారంతో పోలిస్తే 3,526 ఎకరాలు అధికంగా సాగయిందని తెలిపింది. రాష్ట్రంలో సంభవించిన భారీవర్షాలు, వడగళ్లు, ఈదురుగాలుల వల్ల 2.28 లక్షల ఎకరాల్లో వరి, జొన్న, మిర్చి తదితర పంటలకు నష్టం వాటిల్లగా అధికారులు వాటిని తాజా నివేదికలో చేర్చలేదు.


తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.735 కోట్ల వ్యయం

ఈనాడు, దిల్లీ: భారత్‌మాల పరియోజన కింద తెలంగాణలో 2022-23లో ప్రారంభించిన, 2023-24లో ప్రారంభించనున్న 209.73 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి రూ.6,607.61 కోట్లు కేటాయించి ఇప్పటికే రూ.735.01 కోట్లు వ్యయం చేసినట్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో గురువారం ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.


వంతెనల పనులు త్వరగా పూర్తిచేయాలి: మంత్రి వేముల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న వంతెనల పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. గురువారం ఇక్కడి ఆర్‌అండ్‌బీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.  దెబ్బతిన్న రహదారులను జూన్‌ నాటికి పూర్తి చేయాలన్నారు. అధికారులు గణపతిరెడ్డి, సతీష్‌, దివాకర్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


‘పాలమూరు’కు కేటాయింపులపై ట్రైబ్యునల్‌లో నేటి నుంచి వాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ జీవో నం.246 కింద చేసిన నీటి కేటాయింపులపై గురువారం దిల్లీలో కృష్ణా ట్రైబ్యునల్‌-2లో విచారణ ప్రారంభమైంది. ఈ పథకానికి నీటి కేటాయింపులపై అభ్యంతరం తెలుపుతూ ట్రైబ్యునల్‌లో ఏపీ మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేయడంతో కేడబ్ల్యూడీటీ-2 ఛైర్మన్‌ జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌, సభ్యులు జస్టిస్‌ రామ్‌మోహన్‌రెడ్డి, ఎస్‌.తాళపత్ర విచారణ చేపట్టారు. ఏపీ సీనియర్‌ న్యాయవాది జి.ఉమాపతి ఆ రాష్ట్రం వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, వాటికి సంబంధించిన దస్త్రాలను ట్రైబ్యునల్‌ ఎదుట ఉంచి వివరించారు. శుక్రవారం నుంచి వాదనలు ప్రారంభం కానుండగా.. ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాది జయదీప్‌ గుప్తా వాదనలు వినిపించనున్నారు. గురువారం నాటి విచారణకు తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌, ఇంజినీర్లు హాజరయ్యారు.


ఆ 214 మంది ఎస్సైలకు పదోన్నతులు కల్పించండి

సీఎం కేసీఆర్‌కు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బహిరంగ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నోటిఫికేషన్‌ ద్వారా ఎస్సైలుగా నియమితులైన 214 మందికి ఇప్పటి వరకు పదోన్నతులు కల్పించలేదని.. వెంటనే ఖాళీలు ఉన్నచోట అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గురువారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ‘‘ఈ సమస్యపై పోలీసు ఉన్నతాధికారులకు, సీఎం కార్యాలయానికి పలుమార్లు తెలియజేసినా ఫలితం కనిపించలేదని బాధితులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికైనా వారి సమస్యను పరిష్కరించండి. లేనిపక్షంలో న్యాయం కోసం పోరాటానికి బీఎస్పీ సిద్ధంగా ఉంటుం్టది’’ అని పేర్కొన్నారు.


పార్లమెంటేరియన్స్‌ గ్రూప్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అవార్డు దక్కించుకున్న బడుగుల లింగయ్యయాదవ్‌

ఈనాడు, దిల్లీ: భారాస రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ 2021-22 సంవత్సరానికి సంబంధించి పార్లమెంటేరియన్స్‌ గ్రూప్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అవార్డు దక్కించుకున్నారు. గురువారం దిల్లీలోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ చేతులమీదుగా లింగయ్యయాదవ్‌ ఈ అవార్డు స్వీకరించారు. పోక్సో చట్టంపై రాజ్యసభలో అనేక సూచనలు చేయడం, చిన్నారుల అంశాలను పలుమార్లు ప్రస్తావించినందుకుగాను ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.


రంజాన్‌ మాసంలో రుణ వాయిదాలపై ఒత్తిడి చేయొద్దు

హోంమంత్రికి ఆటోడ్రైవర్ల విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: ఆటో రుణాలపై వాయిదాలు చెల్లించాలని ఈ రంజాన్‌ మాసంలో ఫైనాన్షియర్లు ఒత్తిడి చేయకుండా చూడాలని తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం.. హోంమంత్రి మహమూద్‌ అలీకి విజ్ఞప్తి చేసింది. సంఘం నాయకులు మహ్మద్‌ మునీర్‌, ఎం.ఎ.సలీం, మీర్జా ఫాతుల్లాబేగ్‌ తదితరులు గురువారం హోంమంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి ఈమేరకు వినతిపత్రం సమర్పించారు. ‘‘రంజాన్‌ సమయంలో ఆటోడ్రైవర్లకు ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆటోలపై రుణ వాయిదాలు చెల్లించడం కష్టమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రంజాన్‌ మాసంలో ఫైనాన్షియర్లు వాయిదాలు చెల్లించమని ఒత్తిడి చేయకుండా, ఆటోలను స్వాధీనం చేసుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని వినతిపత్రంలో పేర్కొన్నారు.


ఏప్రిల్‌ 25 నుంచి సార్వత్రిక విద్యాపీఠం పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌) ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు.. వచ్చే నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్‌ పరీక్షలు మే 4తో ముగియనుండగా.. ఎస్‌ఎస్‌సీ పరీక్షలు మే 3తో ముగుస్తాయి. ప్రాక్టికల్‌ పరీక్షలు మే 12 నుంచి 19 వరకూ నిర్వహిస్తారు. ఈ మేరకు విద్యాపీఠం డైరెక్టర్‌ పి.వి.శ్రీహరి గురువారం ప్రకటన విడుదల చేశారు.


29 నుంచి గ్రూప్‌ 1 శిక్షణ తరగతులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌ 1 శిక్షణ తరగతులను ఈ నెల 29 నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం సెంటర్‌లో ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ కె.అలోక్‌కుమార్‌ గురువారం తెలిపారు. డిగ్రీతో పాటు ఇంటర్‌లోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన 200 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని