పసిపాపకు మంత్రి హరీశ్‌రావు అండ.. ‘ఈనాడు’ కథనానికి స్పందన

పసిపాప ఆకలి తీర్చడానికి ఓ ఆదివాసీ కుటుంబం పడుతున్న ఇక్కట్లపై మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు దాతలు స్పందించారు.

Updated : 24 Mar 2023 05:06 IST

ముందుకొచ్చిన పలువురు దాతలు

ఈనాడు, హైదరాబాద్‌-ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే: పసిపాప ఆకలి తీర్చడానికి ఓ ఆదివాసీ కుటుంబం పడుతున్న ఇక్కట్లపై మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు దాతలు స్పందించారు. ఆదిలాబాద్‌ జిల్లా రాజుగూడకు చెందిన కొడప పారుబాయి మరణించగా ఆమెకు జన్మించిన పసికందుకు అవసరమయ్యే పాలకోసం కుటుంబసభ్యులు పడుతున్న యాతనపై ‘పసిపాప ఆకలి తీర్చేందుకు.. 10 కిలోమీటర్ల ప్రయాణం’ శీర్షికన గురువారం ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. స్పందించిన హరీశ్‌రావు ఆ పసిపాప కుటుంబానికి సొంతంగా పాడిఆవును అందజేసి పాల సమస్య తీర్చారు. మంత్రి ఆదేశాలతో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి(జేడీఏ) డాక్టర్‌ బి.కిషన్‌ గురువారం ఆవును కొనుగోలు చేసి రాజుగూడలో ఆ పసిపాప తాత బాపురావుకు అప్పగించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి క్షమా దేశ్‌పాండే, ఇంద్రవెల్లి ఎస్‌ఐ డి.సునీల్‌, అంకోలి పీహెచ్‌సీ వైద్యుడు రాహుల్‌ రాజుగూడలో పాపకు దుస్తులు, పాల డబ్బాలు, ఇతర సామగ్రి అందించారు. పసికందును శిశువిహార్‌కు పంపించాలని జిల్లా బాలల పరిరక్షణ విభాగం సీడీపీఓ రాజేంద్రప్రసాద్‌ కుటుంబసభ్యులకు సూచించారు. బీడీఎల్‌ ఇన్నర్స్‌ ఫౌండేషన్‌ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త రఘుతోపాటు పలువురు దాతలు కూడా పసికందును ఆదుకోవడానికి ముందుకొచ్చారు.

మీ ఆలోచనలు.. ఇతరులకు ఆదర్శం: హరీశ్‌

ఖమ్మం జిల్లా సర్వజన ఆస్పత్రి చిన్నపిల్లల విభాగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన వైద్య, ఆరోగ్య సిబ్బందిని మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌ వేదికగా అభినందించారు. గురువారం ‘ఆటస్థలం కాదు.. ఆసుపత్రే..!’ శీర్షికతో ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో సిబ్బందిని మంత్రి ప్రశంసించారు. పిల్లల విభాగాన్ని ఆకర్షణీయంగా మార్చి ఆప్యాయతతో కూడిన సేవలు అందిస్తున్న మీ ఆలోచనలు ఇతర ఆసుపత్రులకు ఆదర్శం అని ట్విటర్‌లో మంత్రి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు